Begin typing your search above and press return to search.

సీట్ల మార్పు మీద మంత్రి గుడివాడ హాట్ కామెంట్స్...!

వేస్తే వేపకొమ్మ తీస్తే అమ్మ వారు తరహాలో సిట్టింగులకు అయిదేళ్ల క్రితం టికెట్ ఇచ్చినపుడు కొత్తవారు కానీ ఇపుడు వారు ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   26 Dec 2023 4:36 PM GMT
సీట్ల మార్పు మీద  మంత్రి గుడివాడ హాట్ కామెంట్స్...!
X

వైసీపీలో ఇపుడు సీట్ల మార్పు అన్న అంశం వేడెక్కిస్తోంది. దీని మీద వైసీపీలో ఏ ఇద్దరు నేతలు కలసినా ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఆశావహులు చాలా మంది ఉన్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఉన్న పట్టు వేరు. బలం బలగం ఉంటాయి. మరో అయిదారు నెలల పాటు అధికారమూ చేతిలో ఉంది.

అలాంటి సిట్టింగుల మార్పు అంటే అతి పెద్ద తలకాయ నొప్పిగానే ఉంటుంది. వేస్తే వేపకొమ్మ తీస్తే అమ్మ వారు తరహాలో సిట్టింగులకు అయిదేళ్ల క్రితం టికెట్ ఇచ్చినపుడు కొత్తవారు కానీ ఇపుడు వారు ఎమ్మెల్యేలు. ఎంతో కొంత ఆ అధికార ముద్ర ఉంటుంది. అలాంటి వారిని కాదని చెప్పే డేరింగ్ ఉండాలంటే గట్స్ కూడా అవసరం.

వైసీపీ అధినాయకత్వం ఇపుడు సీరియస్ గానే ఆ పనిలో ఉంది. నచ్చచెబుతోంది. హామీలు ఇస్తోంది. తన వెంట ఉండమంటోంది. అయితే కొంతమంది నేతలు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. మరి కొందరు ఇతర పార్టీల వైపుగా చూస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీలో సీట్ల మార్పు ఇతరత్రా విషయాల మీద మంత్రి గుడివాడ అమరనాధ్ హాట్ కామెంట్స్ చేశారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ సీట్లు మార్చినా చేసినా తామంతా వైఎస్ జగన్ అనుచరులమని స్పష్టం చేశారు. తమ నాయకుడు జగన్ అని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని అన్నారు. జగన్ ఆలోచిస్తోంది అయిదున్నర కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి తప్ప 175 మంది అభ్యర్ధుల గురించి కాదని అన్నారు.

ఈసారి కచ్చితంగా వైసీపీ అధికారంలోకి రావాలన్నదే జగన్ ఆలోచన అని చెప్పారు. ఆ దిశగానే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఇందులో ఏ ఒక్కరు బాధపడినా అర్ధం చేసుకోగలం కానీ అంతకంటే ఏమీ చేసేది ఉండదని అన్నారు. వైసీపీలో ప్రస్తుతం ఇంచార్జిలను మాత్రమే మారుస్తున్నారు తప్ప ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం లేదు అన్నది కూడా గుర్తుంచుకోవాలని మంత్రి చెప్పడం విశేషం.

ఎపుడైతే బీఫారాలు ఇస్తారో అపుడే అభ్యర్ధులుగా వారికి సీటు ఇచ్చినట్లు అని భావించాలని అన్నారు. ఇదిలా ఉంటే జగన్ పదే పదే వర్క్ షాప్స్ లో కూడా తమకు చెప్పుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ముఖ్యమని, అందులో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు ముఖ్యమని అలాగే కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు కూడా తమ అధినాయకత్వానికి ముఖ్యమని గుడివాడ అన్నారు.

అందువల్ల తమకు సీటు వస్తే ఒకలా రాకపోతే మరోలా స్పందించే రకం తాను కానీ తన పార్టీ వారు కానీ కాదని ఆయన అన్నారు. రేపటి రోజున టికెట్ ఇవ్వకపోతే అలిగి ఇంట్లో కూర్చోవడమో లేక వేరే పార్టీలోకి జంప్ చేసే ఆలోచనలో తమకు లేనే లేవని కూడా మంత్రి గుడివాడ హాట్ కామెంట్స్ చేసారు. జగన్ తోనే తామున్నామని జగన్ వెంటే నడుస్తామని అందువల్ల ఈ విషయంలో ఎవరికీ రెండవ ఆలోచన లేనేలేదని అన్నారు.

మొత్తానికి గుడివాడ వంటి మంత్రి ఈ సీట్ల మార్పు పైన చేసిన కామెంట్స్ సంచలనం అవుతున్నాయి. టికెట్ రాకపోతే పార్టీ మారే రకం కాదని ఆయన చెప్పడం వెనక ఎవరిని ఉద్దేశించి అన్నారో అన్న చర్చ కూడా నడుస్తోంది.