పల్లాకు మంత్రి పదవి? టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి?
ఇప్పుడు పల్లా మంత్రి అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తవారిని నియమిస్తారా? లేక పల్లానే కొనసాగిస్తారా? అనేది చర్చకు తావిస్తోంది.
By: Tupaki Desk | 29 Dec 2024 4:47 AM GMTఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. జనసేన నేత నాగబాబుతోపాటు పల్లాకు క్యాబినెట్ ఖాయమని చెబుతున్నారు. దీంతో పల్లా మంత్రి అయితే ఆయన స్థానంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ మొదలైంది.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఈ ఏడాది జూన్ లో పల్లా శ్రీనివాసరావును నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన పల్లాను కచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. అయితే సామాజిక సమీకరణాలు, ఇతర ప్రాధాన్యాలు తెరపైకి రావడంతో పల్లా పేరు చివరి నిమిషంలో వెనక్కి వెళ్లిపోయింది. దీంతో అప్పటివరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అచ్చెన్నాయుడు స్థానంలో పల్లాను పార్టీ చీఫ్ గా నియమించారు.
దాదాపు ఏడు నెలలుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న పల్లా అధినేత మన్ననలు అందుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను పకడ్బందీ నిర్వహిస్తూ తన సమర్థతను నిరూపించుకుంటున్నారు. పార్టీ కార్యక్రమంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న ప్రజాదర్బారులో తనతోపాటు పార్టీ నేతలు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూస్తున్నారు. అదేసమయంలో కార్యకర్తలు కష్టసుఖాలకు ప్రాధాన్యమిస్తున్నారని చెబుతున్నారు. వీటిన్నటికీ మించి టీడీపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేశారు. దాదాపు 80 లక్షల సభ్యత్వాలు చేయించి పార్టీ నెట్ వర్క్ విస్తరించారు. దీంతో ఆయన సమర్థతకు తగిన గుర్తింపునివ్వాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా నమోదైన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కార్యవర్గాలను నియమించారు. ఏపీ టీడీపీకి తొలి అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేత కిమిడి కళావెంకటరావును నియమించారు. 2014లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కళా 2017లో రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. ఆ తర్వాత కూడా 2019 వరకు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కళా నుంచి అధ్యక్ష బాధ్యతలను మరో బీసీ నేత అచ్చెన్నాయుడికి అప్పగించారు. అచ్చెన్నాయుడు కూడా ఐదేళ్లపాటు రాష్ట్రపార్టీ చీఫ్ గా పనిచేశారు. ఆయన మంత్రివర్గంలో చేరాక ఉత్తరాంధ్రకే చెందిన బీసీ నేతగా పల్లాకు చాన్స్ ఇచ్చారు.
ఇప్పుడు పల్లా మంత్రి అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తవారిని నియమిస్తారా? లేక పల్లానే కొనసాగిస్తారా? అనేది చర్చకు తావిస్తోంది. రాష్ట్ర పార్టీ చీఫ్ గా బీసీ నేతలకు అవకాశమిస్తున్న అధినేత చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధికారంలో ఉండగా, అధ్యక్ష పదవి చేపట్టాలని చాలా మంది నేతలు పోటీపడుతున్నారు. వరుసగా పదేళ్ల పాటు ఉత్తరాంధ్ర నేతలే ఈ పదవిని చేపడుతున్నారు. దీంతో ఈ సారి రాయలసీమ, దక్షిణ కోస్తా నేతలకు చాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం ఈ సారి బీసీలకే పట్టం కడతారా? లేక ఎస్సీ, ఎస్టీ నేతలు ఎవరినైనా పార్టీ చీఫ్ చేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.