కేటీఆర్ వ్యాఖ్యలతో టీడీపీ తర్జన భర్జన.. ఏం జరిగింది?!
అసలే ఎన్నికల సమయం. పైగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహం. వెరసి.. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు అందరూ నెచ్చెలులుగానే కనిపిస్తున్నారు
By: Tupaki Desk | 14 Oct 2023 8:18 AM GMTఅసలే ఎన్నికల సమయం. పైగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహం. వెరసి.. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు అందరూ నెచ్చెలులుగానే కనిపిస్తున్నారు. ఆది నుంచి టీడీపీని, చంద్రబాబు ను ఎన్నికల సమయంలో సంపూర్ణంగావ్యతిరేకిస్తూ.. ఆంధ్రోళ్లు మనపై పెత్తనం చేసేందుకు మళ్లీ వస్తున్నారనే సెంటిమెంటును రగిలించిన పార్టీ.. ఇప్పుడు అదే చంద్రబాబు కుటుంబానికి దన్నుగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తాజాగా బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మంత్రి కేటీఆర్.. చంద్రబాబు అరెస్టు, జైలు విషయాలపై చాలా గుంభనమైన వ్యాఖ్యలు చేశారు. ఇదేసమయంలో తెలంగాణ ఉద్యమం కోసం.. తన తండ్రి, ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రాణాలకు తెగించి పోరాడారనే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. జైల్లో అననుకూల పరిస్థితుల కారణంగా.. తన తండ్రి ప్రాణాలకే ముప్పు ఉందన్న ట్వీట్‌పై కేటీఆర్ స్పందించడం వెనుక ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశమే ఉందని పలువురు టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సెటిలర్ల ఓటు, ముఖ్యంగా టీడీపీ సానుకూల ఓట్లు కూడా తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టయి.. జైల్లో గత 30 రోజులకు పైగానే ఉన్నప్పటికీ.. మాట మాత్రంగా కూడా స్పందించని కేటీఆర్.. ఇప్పుడు అనూహ్యంగా అంత ప్రేమ వెలిబుచ్చడంవెనుక ఖచ్చితంగా ఓటు బ్యాంకుపై కన్నేయడమేనని తెలంగాణ టీడీపీ నాయకులు భావిస్తున్నారు. అలాగని ఈ విషయాన్ని నేరుగా బయటకు చెప్పలేక.. తర్జన భర్జన పడుతున్నారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికలు.. అనేక పరిణామాలకు దారితీస్తున్నాయనేది మాత్రం వాస్తవం అంటున్నారు.