Begin typing your search above and press return to search.

కృష్ణుడి వద్దకు కృష్ణుడి రాయబారం.. ఎమ్మెల్యేకు మంత్రి బుజ్జగింపులు

మహబూబ్ నగర్ ఎంపీ అయిన అరుణ భవిష్యత్ లో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, కేంద్ర మంత్రి పదవినీ పొందే అవకాశం లేకపోలేదు.

By:  Tupaki Desk   |   1 Aug 2024 7:18 AM GMT
కృష్ణుడి వద్దకు కృష్ణుడి రాయబారం.. ఎమ్మెల్యేకు మంత్రి బుజ్జగింపులు
X

చేరి నెల కూడా తిరగకముందే అధికార కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. గద్వాల వంటి రాజకీయ ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గం, డీకే అరుణ కుటుంబ సభ్యుడైన బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండడం కీలకం అని కూడా ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లున్నారు. భవిష్యత్ లో డీకే కుటుంబాన్ని ఢీ కొట్టాలంటే గద్వాలలో క్రిష్ణమోహన్ రెడ్డినే సమర్థుడు అనే అభిప్రాయం వారిలో నెలకొందని తెలుస్తోంది. వాస్తవానికి గద్వాలలో గత ఏడాది ఎన్నికల్లో బీసీ సామాజికవర్గం, మహిళ అయిన జడ్పీ చైర్ పర్సన్ సరితను బరిలో దింపినా ఆమె విజయం సాధించలేదు. స్థానికంగా రాజకీయం సంక్లిష్టంగా ఉండే నేపథ్యంలో దానిని సమర్థంగా ఎదుర్కొనే వ్యూహం కాంగ్రెస్ కు అవసరం. పైగా డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో రాష్ట్ర స్థాయిలో కీలకంగా ఉన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ అయిన అరుణ భవిష్యత్ లో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, కేంద్ర మంత్రి పదవినీ పొందే అవకాశం లేకపోలేదు.

ఎమ్మెల్యే ఇంటికి మంత్రి

మళ్లీ బీఆర్ఎస్ అంటున్న క్రిష్ణమోహన్ రెడ్డిని నిలువరించే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ మంత్రి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన జూపల్లి కృష్ణారావు రాయబారం జరిపారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే బండ్ల ఇంటికి వెళ్లారు. బీఆర్ఎస్ లోకి వెళ్లే ఆలోచనను మానుకోవాలని కోరినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ లో చేరడాన్ని గద్వాల కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించడం లేదు. వారితో ఎమ్మెల్యేకు మొదటినుంచి రాజకీయ వైరం ఉంది. కొందరు బహిరంగంగానే వ్యతిరేకించారు. దీంతో ఆయనకు సమస్యలు ఎదురయ్యాయని తెలుస్తోంది. ఇదంతా ఏమిటని భావించిన ఎమ్మెల్యే.. కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

అరుణకు అడ్డుకట్ట వేసేలా..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోనే కాదు మంత్రి జూపల్లి క్రిష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డితోనూ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు రాజకీయ వైరం ఉంది. కొల్లాపూర్ రాజకీయాల్లో అరుణ ప్రమేయాన్ని జూపల్లి తీవ్రంగా వ్యతిరేకించేవారు. మరోవైపు రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు అరుణ కాంగ్రెస్ లో, రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చేసరికి అరుణ బీజేపీలోకి వెళ్లారు. క్రిష్ణమోహన్ రెడ్డి సమీప బంధువే అయినా.. అరుణ గద్వాల ఎమ్మెల్యేగా పోటీకి వస్తే ఆయనకూ ఇబ్బందే. అరుణ ప్రాబల్యం పెరగడం, బీజేపీ మహబూబ్ నగర్ జిల్లాలో విస్తరించకుండా చూడాలన్నా కాంగ్రెస్ కు క్రిష్ణమోహన్ రెడ్డి అవసరం ఉంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీఎం రేవంత్ సొంత జిల్లా. అక్కడ బీఆర్ఎస్ కు ఉన్నది ఇద్దరు ఎమ్మెల్యేలు. వీరిలో క్రిష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చినట్లే వచ్చారు. మిగిలింది అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఆయననూ ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ ను జీరో చేయొచ్చు అని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు భావించారు. ఈలోగా క్రిష్ణమోహన్ రెడ్డి వెనక్కు వెళ్లిపోవడం అంటే ఇబ్బందికరమే. అందుకే ఆయనను బుజ్జగించి కొనసాగేలా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.