మంత్రి నాదెండ్లకు కత్తిమీద సామే..!
రాష్ట్రంలో ఏర్పడిన కూటమి సర్కారులోజనసేన నాయకుడు, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కేబి నెట్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 19 Jun 2024 8:09 AM GMTరాష్ట్రంలో ఏర్పడిన కూటమి సర్కారులోజనసేన నాయకుడు, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కేబి నెట్‌లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆయనకు సీఎం చంద్రబాబు పౌరసరఫరాల శాఖను కేటాయించారు. అయితే..ఇదేమంత తేలికైన శాఖ కాదు. ఇప్పటికే ఈ శాఖలో అవినీతి పెరిగిపోయిందని.. పేర్కొంటూ.. ఈ నెల పంపిణీ నిలిపివేశారు. ఇక వచ్చే నెల నుంచి పంపిణీ ప్రారంభించాలన్నా..అసలు ఈ వ్యవస్థ రూపు రేఖలను సమూలంగా మార్చేసిన వైసీపీ సర్కారు నిర్ణయాలు కొనసాగిస్తారా? అనేది ప్రశ్న.
గతంలో జగన్ అధికారంలోకి రాగానే.. వ్యవస్థ రూపు రేఖలను సమూలంగా మార్చేశారు. అప్పటి వరకు డీలర్ల వ్యవస్థ ఉన్న రేషన్ పంపిణీ విషయంలో అనూహ్యంగా డోర్ డెలివరీ వ్యవస్థను తీసుకువచ్చారు. ఇది ప్రజలకు చేరువైంది. ఫలితంగా అప్పటి వరకు రేషన్ దుకాణాల ముందు క్యూకట్టిన ప్రజలు.. ఇంటికే రేషన్ రావడంతో హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల అనేక మందికి ఉపాధిలభించింది. అయితే.. ఇది సర్కారుకు ఆర్థిక భారంగా మారిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ అనుసరించిన పథకాన్ని కొనసాగిస్తారా? లేక తీసేస్తారా? అనేది చూడాలి. ఇది రాజకీయంగా ముడిపడిన వ్యవహారమే కాదు.. ప్రజల సెంటిమెంటుకు కూడా ముడిపడిన వ్యవహారం. ఇప్పటి వరకు ఇంటికే వచ్చిన రేషన్ ఒక్కసారిగా నిలిచిపోతే.. ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. దీని నుంచి బయట పడుతూనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు.. డీలర్ల సమస్యలు కూడా.. వెంటాడు తున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న ఇంటింటికీ రేషన్ పంపిణీతోతమ ఉపాధిపోయిందని రేషన్ డీలర్ల సంఘం పేర్కొంది.
ఈ నేపథ్యంలో డీలర్లను కూడా సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇక, పౌరసరఫరాలో కీలకమైన సమస్య.. నాణ్యమైన వస్తువుల పంపిణీ. ఈ విషయంలో అన్ని ప్రభుత్వాలు కూడా.. విఫలమవు తూనే ఉన్నాయి. దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. అధికారుల అవినీతి.. తూకంలో తేడాలను కూడా అరికట్టాలి. నూతన రేషన్ కార్డుల పంపిణీతోపాటు.. అక్రమాలను కూడా ఏరేయాల్సిన అవసరం ఉంది. ఇలా.. ఎటు చూసినా మంత్రి సవాళ్లే స్వాగతం పలుకుతున్నాయి. మరిఏం చేస్తారో చూడాలి.