గుడ్: వీఐపీ కారు డ్రైవర్లకు ఫిట్ నెస్ పరీక్షలన్న మంత్రి పొన్నం
తమ కారు డ్రైవర్ విషయంలో పలువురు పలు అంశాల్ని పరిగణలోకి తీసుకుంటారే తప్పించి.. తమ భద్రతకు ఎంత ముప్పు ఉందన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు.
By: Tupaki Desk | 25 Feb 2024 4:48 AM GMTకీలక నిర్ణయాన్ని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. వీఐపీల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కానీ కొన్ని కీలకమైన అంశాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండటం కనిపిస్తుంది. తమ కారు డ్రైవర్ విషయంలో పలువురు పలు అంశాల్ని పరిగణలోకి తీసుకుంటారే తప్పించి.. తమ భద్రతకు ఎంత ముప్పు ఉందన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఈ కారణంగా డ్రైవర్ తప్పులకు పలువురు ప్రముఖులు బలి అవుతుంటారు.
తాజాగా చోటు చేసుకున్న విషాద ఉదంతంలోనూ డ్రైవర్ తప్పిదమే కనిపిస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూయటం తెలిసిందే. ఈ వ్యవహారంలో కారు డ్రైవర్ దే పూర్తి తప్పు అన్న మాట బలంగా వినిపిస్తోంది. పోలీసుల ప్రశ్నలకు సైతం అతడు సరైన రీతిలో సమాధానం ఇవ్వట్లేదు. రెయిలింగ్ కు ఢీ కొన్న దానికి 500 మీటర్ల ముందు నుంచి కారు విడి భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూస్తే.. ఏదైనా బలమైన వాహనం గుద్ది ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగామారింది.
అదే సమయంలో కారు డ్రైవర్ తాను నిద్ర మత్తులో ఉన్నట్లుగా చెప్పటం తెలిసిందే. ఈ క్రమంలో వీవీఐపీలు.. రాజకీయ నేతలు.. ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులకు చెందిన కారు డ్రైవర్లకు ఫిట్ నెస్ పరీక్ష నిర్వహిస్తామని.. వారి సామర్థ్యాల్ని అంచనా వేస్తామని వ్యాఖ్యానించారు. నిజమే.. ప్రముఖులకు వాహన డ్రైవర్లుగా ఉండే వారు ఫిట్ గా ఉండటం చాలా ముఖ్యం.
వీఐపీలు అందరికి తాము లేఖలు పంపుతామని.. వారి డ్రైవర్లను ఫిట్ నెస్ పరీక్షకు పంపాలన్నారు. ఎమ్మెల్యే లాస్య నందిత మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని.. వీఐపీలందరూ తమ కార్ల డ్రైవర్లను టెస్టుకు పంపాలన్నారు. టెస్టుల తర్వాత రిపోర్టులు వారికి పంపుతామని చెప్పారు. దూర ప్రయాణాలకు వెళ్లే సమయంలో బాగా అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించుకోవాలన్న సూచన చేశారు. నిజమే.. మంత్రి పొన్నం ఆలోచన భేష్ అని చెప్పాలి.