Begin typing your search above and press return to search.

విశాఖ, విజయనగరంలో మంత్రి పదవులు వీరికేనా?

ఇందులో భాగంగా ప్రధానంగా జిల్లాల్లో ఇద్దరు ముగ్గురు సీనియర్లు ఉన్న చోట పరిస్థితి ఎలా ఉండబోతుందనే చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   9 Jun 2024 4:38 AM GMT
విశాఖ, విజయనగరంలో మంత్రి పదవులు వీరికేనా?
X

జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి ఏర్పాట్లు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. మరోపక్క కూటమితో ఏర్పడిన ప్రభుత్వంలో టీడీపీ నుంచి ఎవరికి కేబినెట్ బెర్త్ లు దక్కుతాయనేది ఆసక్తిగా మారింది. ఇందులో ప్రధానంగా విశాఖ నుంచి చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారనేది మరింత ఆసక్తిగా మారింది.

అవును.. ఏపీలో టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. మరో మూడు రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇదే సమయంలో కేబినెట్ కూర్పుపైనా అందరి ఆసక్తి నెలకొంది. అయితే ఈ సారి సీనియర్లు, జూనియర్లతో కేబినెట్ ఉండబోతుందని అంటున్నారు. దీంతో... ఈసారి చంద్రబాబు కేబినెట్ పాత మంత్రులు, కొత్త మంత్రుల కలయికతో ఉండబోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగా ప్రధానంగా జిల్లాల్లో ఇద్దరు ముగ్గురు సీనియర్లు ఉన్న చోట పరిస్థితి ఎలా ఉండబోతుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఉమ్మడి విశాఖ జిల్లాలో మంత్రి పదవుల కోసం అటు అయ్యన్నపాత్రుడు, ఇటు గంటా శ్రీనివాస్ లు ఇద్దరూ ఎదురూచూస్తునారని అంటున్నారు. 2014 - 19 సమయంలో వీరిద్దరూ మంత్రులుగా పనిచేశారు కూడా. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు ఇద్దరిలో ఒకరికే ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇందులో ప్రధానంగా మోస్ట్ సీనియర్ లీడర్ అయ్యన్నపాత్రుడి వైపే టీడీపీ అధినేత మొగ్గుచూపే అవకాశం ఉందని.. ఆయన సీనియారిటీకి గౌరవమిస్తూ కాస్త పెద్ద శాఖనే కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక గంటా శ్రీనివాస్ విషయానికొస్తే... ఆయనకు చివర్లో టిక్కెట్ దక్కింది.. ఒకానొక సమయంలో బాబు చెప్పిన చోట పోటీకి గంటా నో అన్నారనే వార్తలు కూడా వచ్చాయి!

ఈ నేపథ్యంలో విశాఖ సిటీలో గాజువాక నుంచి గెలిచిన పల్లా శ్రీనివాసరావుకే ఎక్కువ ఛాన్స్ ఉందని.. ఈసారి అయ్యన్నతో పాటు పల్లాకు అవకాశం ఉందని.. గంటాకు ఛాన్స్ ఉండకపోవచ్చని అంటున్నారు.

అశోక్ గజపతిరాజు కుమార్తెకు ఛాన్స్?:

ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికొస్తే... 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఈ సమయంలో జూనియర్లు - సీనియర్లతో కూడిన కేబినెట్ ఉండబోతుందని కథనాలొస్తున్న వేళ... ఈ జిల్లా నుంచి తొలిసారి గెలిచిన అదితి గజపతిరాజుకు మంత్రిపదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

పార్టీ ఫౌండర్లలో ఒకరైన అశోక్ గజపతిరాజు రాజకీయాల నుంచి సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకున్న నేపథ్యంలో.. ఆయన కుమార్తె రంగంలోకి దిగారు. తొలిసారి పోటీ చేసిన ఆమె 60,609 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ నేపథ్యంలో.. ఆమెకూ కేబినెట్ బెర్త్ కన్ ఫాం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!