Begin typing your search above and press return to search.

ఏపీలోని మంత్రులకు లాక్ నేనా ?

ఆయా శాఖల ద్వారా జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళడమే ఉద్దేశ్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 3:30 PM GMT
ఏపీలోని మంత్రులకు లాక్ నేనా ?
X

ఏపీలో మంత్రులకు ఒక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ని నియమించాలని మంత్రివర్గం ప్రతిపాదించి ఆమోదముద్ర వేసింది అన్న దాని మీద చర్చ సాగుతోంది. ఎంబీయే గ్రాడ్యుయేట్ ని ఈ పోస్ట్ కోసం తీసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే ప్రతీ మంత్రి పరిధిలోని శాఖలన్నింటికీ కలిపి ఒక పీఆర్వోని ఏర్పాటు చేయడానికి కూడా మంత్రి వర్గం నిర్ణయించింది. అలాగే సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కూడా ప్రతీ మంత్రిత్వ శాఖకు ఉంటారు. ఆయా శాఖల ద్వారా జరిగే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళడమే ఉద్దేశ్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.

అయితే ఈ విధంగా చేయడం వల్ల మంత్రులకు పరిమితులు ఏర్పడ్డాయా లేక వారికి మరింత ఎక్కువ గౌరవం పెరిగిందా అన్నది కూడా చర్చగా సాగుతోంది. అయితే ఒక మంత్రికి ఒక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ని ఒక పీఆర్వోని ఒక సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ని నియమించడం అంటే మంత్రులకు పరిమితులు ఏర్పడినట్లే అంటున్నారు.

ఈ పోస్టులు అన్నీ కూడా లోకేష్ నియమిస్తే కనుక మంత్రులకు ఏ విధంగానూ ఫుల్ పవర్స్ ఉండవని అంటున్నారు. ఎందుకంటే మంత్రుల చుట్టూ ఒక వలయం ఏర్పడిపోతుంది. వీరికే మంత్రుల కదలికలు నిర్ణయాలు వారు ఏమి చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు ఇలా ప్రతీ విషయమూ తెలిసి పోతుంది. దాంతో వారు కచ్చితంగా లోకేష్ కి చంద్రబాబుకు ఈ విషయాల మీద ఎప్పటికపుడు నివేదికలను ఇస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది.

ఇది ఈ రోజు ముచ్చట కాదు అని అంటున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇలాగే మంత్రుల చుట్టూ తమకు నచ్చిన తాము ఎంపిక చేసిన అధికారులను వివిధ హోదాలలఒ పెట్టి ఇబ్బంది పెట్టారు అని అంటున్నారు.

ఇక మళ్లీ ఎవరు ఏమి చేయకుండా కట్టడి చేసే ప్రక్రియగా కూడా దీనిని చూస్తున్నారు. ఒక వేళ ఎవరైనా ఈ అధికారుల నీడను కూడా దాటుకుని ఏమి చేసినా ఎవరు ఏమి చేయాలనుకున్నా ఒక ఏడాది మాత్రమే వారి పదవి ఉంటుందని కూడా ప్రచారం సాగుతోంది. ఆ తరువాత వారు చేసేది ఏమీ ఉండదని అంటున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే ఇది టీడీపీ కూటమికి ప్రభుత్వానికి నష్తం అని చెబుతున్నారు. మంత్రులకు స్వేచ్చ ఉండాలి. వారి మీద నిఘా పెట్టినట్లుగా ఇలా అధికార గణాన్ని నియమిస్తే ఏమేమి చేయాలో ఎక్కడ నుంచో సూచనలు వస్తే ఒకవేళ మంత్రులు ఏమైనా నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ లీక్ అయితే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.

ముఖ్యంగా స్వేచ్చగా మంత్రులు ఎవరూ తమ విధులను చేసేందుకు ఆస్కారం ఉండదని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఆలోచన కార్పొరేట్ సిస్టం గా బాగానే ఉంటుంది కానీ ప్రజాస్వామ్యంలో మాత్రం అంతగా పనికి రాదు అని అంటున్నారు. మంత్రుల విషయంలో వారి ఆలోచనలకు వారు చేయనివ్వాలి. వాటిలో తప్పు ఒప్పులు ఉంటే ఎటూ ప్రభుత్వ పెద్దగా సీఎం ఉంటారు కాబట్టి చక్కదిద్దుతారు.

ఈ విధంగా వారి చుట్టూ గోడ కట్టేసి వారిని ఒక పరిధిలో పరిమితిలో ఉంచేయాలనుకుంటే నిర్ణయాలు అన్నవి వినూత్నంగా రావేమో అన్న చర్చ సాగుతోంది. అలాగే మంత్రులు కూడా ఏమి చేయాలో ఏమి చేయకూడదో అన్న అభద్రతాభావానికి గురి అవుతారు అని అంటున్నారు.

ఇక చూస్తే గతంలో కొన్నిసార్లు ఇలాంటి అధికారిక వ్యవస్థను మంత్రుల చుట్టూ పెడితే వారే డామినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అన్నదీ ఉంది. అలాగే కొన్ని సార్లు మంత్రుల కంటే పీఆర్వోలే బాగా చలామణీ అయిన సందర్భాలు ఉన్నాయి. మంత్రులకు గైడెన్స్ అవసరం అనుకుంటే ఎప్పటికపుడు ప్రభుత్వ పెద్దలే చెప్పడం ఆ మీదట వారి సొంత నిర్ణయాలకు వదిలేయడం వల్లనే ప్రజాస్వామ్యంలో మంచి నిర్ణయాలు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో.