Begin typing your search above and press return to search.

'స‌హ‌కారానికి' చిక్కులు.. ఈ నిర్ణ‌యాలే అడ్డంకులా ..!

ఏపీలో ఒక‌రిద్ద‌రు మంత్రులు మిన‌హా.. ఇత‌ర మంత్రుల‌ను పలకరిస్తే.. ``ఏం చేస్తాం బాస్‌. ఆ సార్ సంత‌కం పెట్టలేదు`` అనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   21 Feb 2025 1:30 PM GMT
స‌హ‌కారానికి చిక్కులు.. ఈ నిర్ణ‌యాలే అడ్డంకులా ..!
X

ఏపీలో ఒక‌రిద్ద‌రు మంత్రులు మిన‌హా.. ఇత‌ర మంత్రుల‌ను పలకరిస్తే.. ``ఏం చేస్తాం బాస్‌. ఆ సార్ సంత‌కం పెట్టలేదు`` అనే మాట వినిపిస్తోంది. అంతేకాదు.. మంత్రులు వ‌ద్ద‌న్న ప‌నులు చేస్తున్న‌వారు కూడా క‌నిపిస్తున్నారు. వీరే ఉన్నతాధికారులు. ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారులు మంత్రుల‌కు కొరుకుడు ప‌డ‌డం లేదు. ఆయా శాఖ‌ల్లో ప‌నిచేస్తున్న ఉన్న‌తాధికారుల వ్య‌వ‌హార శైలిపై మంత్రులు గ‌రంగ‌రంగానే ఉన్నారు. కొంద‌రు పైకి చెప్పుకొంటున్నారు. మ‌రికొంద‌రు దిగ‌మింగుతున్నారు అంతే తేడా!

ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి త‌ర్వాత‌.. అంత‌టి ప్రొటోకాల్ ఉన్న ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కూడా అధికారుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాను ఇవ్వ‌ద్ద‌ని చెప్పినా.. వైసీపీ హ‌యాం లో రుషికొండ‌పై ఇంద్ర భ‌వ‌నాన్ని నిర్మించిన కాంట్రాక్ట‌ర్‌కు ఉన్న‌తాధికారులు సొమ్ములు చెల్లించార‌ని ఆయ‌న ఫైర్ అయ్యారు. అధికారుల‌ను ఒక్కొక్క‌రుగా పిలిచి క్లాస్ తీసుకున్నారు. అనంత‌రం.. చేసేది లేక‌.. ఇక‌పై `చెప్పింది వినండి` అని ముక్తాయించి పంపేశారు.

క‌ట్ చేస్తే.. ఈ త‌ర‌హా అధికారులు అన్ని శాఖ‌ల్లోనూ ఉన్నారు. మ‌రి ఇక్క‌డ జ‌రుగుతోంది ఏంటి? ఎందుకు ? అనేది ఆరా తీస్తే.. స‌ర్కారుకు స‌హ‌క‌రించిన అధికారుల‌కు జ‌రుగుతున్న ప‌రాభ‌వాలే ఇప్పుడు త‌మ‌కు కూడా ఎదుర‌య్యే అవ‌కాశం ఉందని న‌ర్మ‌గ‌ర్భంగా కొంద‌రు అధికారులు వెల్ల‌డిస్తున్నారు. ``మాకెందుకండీ.. రూల్స్ ప్ర‌కారం స‌వ్యంగా ఉంటే చేస్తాం. లేక‌పోతే.. రేపు చిక్కులు ఎదుర్కొనాల్సింది మేమే`` అని ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో ఉన్న‌త ప‌ద‌విలో ఉన్న ఐఏఎస్ అధికారి ఒక‌రు వ్యాఖ్యానించారు.

గ‌త వైసీపీ హ‌యాంలో.. అంత‌కు ముందు టీడీపీ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించార‌న్న కార‌ణంగా.. చాలా మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ల‌ను లూప్‌లైన్‌లో పెట్టారు. కొంద‌రిని స‌స్పెండ్ చేశారు. ఇక‌, ఇప్పుడు కూట‌మి స‌ర్కారు లోనూ అదే జ‌రుగుతోంది. ఈ త‌ర‌హా నిర్ణ‌యాలే అధికారులను వ‌ణికిస్తున్నాయి. పైగా.. ఎవ‌రికి మేలు చేసి నా.. త‌మ‌కు వ‌చ్చేది ఏమీలేద‌ని.. తాము సంపాయించుకునేందుకు మార్గం లేద‌ని.. వారు చెబుతున్నారు.

బ‌హుశ‌.. ప్ర‌స్తుతం మంత్రులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌కు ఇదే ప్ర‌ధాన కార‌ణ‌మై ఉంటుంద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిజానికి చంద్ర‌బాబు హ‌యాంలో రూల్స్ ప్ర‌కార‌మే ప‌నిచేస్తారు. అయినా.. అధికారులు త‌మ మాట విన‌డం లేద‌ని మంత్రులే చెబుతున్న ద‌రిమిలా.. దీనిపై చంద్ర‌బాబు స్వ‌యంగా జోక్యం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీనియ‌ర్ నాయ‌కులు సైతం కోరుతున్నారు.