Begin typing your search above and press return to search.

కర్ణాటక మంత్రి హైదరాబాద్ కు వచ్చి అలా చేస్తే.. పోలీసులు లైట్ తీసుకోవటమా?

మంత్రి శివానంద్ లక్షలాది రూపాయిల నోట్లను వెదజల్లిన వైనం షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 4:22 AM GMT
కర్ణాటక మంత్రి హైదరాబాద్ కు వచ్చి అలా చేస్తే.. పోలీసులు లైట్ తీసుకోవటమా?
X

సామాన్యులకు ఒక న్యాయం.. వీవీఐపీలకు మరో న్యాయమా? తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి పరిస్థితుల్లో ఎంత మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోడ్ పేరుతో.. రూ.50వేల కంటే ఎక్కువ నగదును తీసకెళుతున్న వారిని అడ్డుకోవటం.. వాటిని స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. నిజానికి ఎన్నికల కోడ్ మొత్తం కూడా రాజకీయ పార్టీల ధన ప్రవాహన్ని అడ్డుకోవటమే తప్పించి.. సామాన్యులకు షాకులు ఇవ్వటం కాదు. కానీ.. కోడ్ వేళ.. రూల్ ఫర్ వర్కు అన్నట్లుగా వ్యవహరిస్తూ.. ఆసుపత్రికి డబ్బులు తీసుకెళుతున్నాం.. కాలేజీ ఫీజు కోసం తీసుకెళుతున్నామని చెప్పినా.. ససేమిరా అనేస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు.

ఇలాంటి వేళ.. కర్ణాటక మంత్రి ఒకరు హైదరాబాద్ లో వ్యవహరించిన తీరు తాజాగా బయటకు వచ్చి షాకింగ్ గా మారింది. ఈ పెళ్లి వేడుకకు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి కూడా వెళ్లారు. అంటే.. కచ్ఛితంగా తెలంగాణ పోలీసులు మరి ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు కూడా ఉండి ఉంటారు. సామాన్యుల మీద ప్రతాపం చూపే పోలీసులు కర్ణాటక మంత్రి చేసిన పనిని ఎందుకు అడ్డుకోలేదు? కేసు ఎందుకు నమోదు చేయలేదు? అని ప్రశ్నిస్తున్నారు.

ఇంతకూ కర్ణాటక మంత్రి హైదరాబాద్ కు వచ్చి చేసిందేమిటి? అన్న విషయంలోకి వెళితే.. గులర్బాకు చెందిన నూర్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్స్ ఛైర్మన్ అయాజ్ ఖాన్ కుమార్తె పెళ్లి వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ అటెండ్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన కచేరీలో.. మంత్రి శివానంద్ లక్షలాది రూపాయిల నోట్లను వెదజల్లిన వైనం షాకింగ్ గా మారింది.

నిజానికి ఈ ఉదంతం చోటు చేసుకొని మూడు.. నాలుగు రోజులైనప్పటికీ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. పెళ్లి వేడుకలో కర్ణాటక మంత్రి ఇలా చేశారంటూ ఫోటోలు బయటకు రావటంతో అసలు విషయం బయటకు వచ్చింది. పెళ్లి వేడుకలో తాను చేసిన పనిని కర్ణాటక మంత్రి సమర్థించుకున్నారు.

అయితే.. సదరు మంత్రి మిస్ అవుతున్న పాయింట్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉందని.. రూ.50వేలకు మించిన ధనాన్ని ఎవరూ క్యారీ చేయకూడదని.. ఒకవేళ క్యారీ చేస్తే అందుకు తగ్గ పత్రాలు ఉండాలని చెబుతున్న విషయాన్ని మరిచిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

అంతేకాదు.. కరెన్సీ నోట్లను వెదజల్లిన ఉదంతానికి సంబంధించిన ధ్రువ పత్రాలేవి? వాటిని హైదరాబాద్ పోలీసులు చెక్ చేశారా? లాంటి ప్రశ్నల్ని సంధిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కర్ణాటక నుంచి డబ్బులు అందుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ తరహా పనులు పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తాయన్న మాట వినిపిస్తోంది.