Begin typing your search above and press return to search.

ట్యాపింగ్ తర్వాతి లెవల్ కు వెళ్లనుందా? తాజాగా జరుగుతుందన్నదేంటి?

కోతి పుండు బ్రహ్మరాక్షసి అన్నట్లుగా మారింది తెలంగాణలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతం.

By:  Tupaki Desk   |   20 April 2024 4:54 AM GMT
ట్యాపింగ్ తర్వాతి లెవల్ కు వెళ్లనుందా? తాజాగా జరుగుతుందన్నదేంటి?
X

కోతి పుండు బ్రహ్మరాక్షసి అన్నట్లుగా మారింది తెలంగాణలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతం. రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత కొన్ని సోషల్ మీడియాలో వేదికల మీద ఆరోపణల పేరుతో పోస్టులు పెట్టటం.. వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున షేర్ కావటంతో మొదలైన ఈ అంశం.. ఇప్పుడు ప్రధాన మీడియాలో పేజ్ వన్ వార్తగా మారుతోంది. ఇక్కడే మరో విషయాన్ని గమనించాలి.

సాధారణంగా ఏదైనా సంచలన అంశానికి సంబంధించిన వివరాలు బయటకు వస్తే.. అధికార పార్టీ స్పందిస్తుంది. అందునా ప్రధానప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో పడేసే బంపర్ ఆఫర్ ను ఏ ప్రభుత్వం వదులుకోదు. రేవంత్ సర్కారు విషయానికి వస్తే.. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ పై వారు పెద్దగా స్పందించింది లేదు. పోలీసుల పనిగానే వదిలేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై నిత్యం పత్రికల్లో వార్తలు వచ్చినా.. రియాక్టు కాని మంత్రులు.. ముఖ్యమంత్రి.. ఇటీవల కాలంలో మాత్రంరియాక్టు అవుతున్నారు.

శుక్రవారం ఒక్కరోజున చూస్తే.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. రేవంత్ సర్కారులో కీలకమైన మంత్రిగా పేరున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ స్పందించిన తీరు.. ఫోన్ ట్యాపింగ్ మీద చేసిన వ్యాఖ్యలు చూస్తే.. అధికార పక్షం టోన్ మారుతుందన్న అభిప్రాయం కలిగేలా ఉందని చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తే.. కేసీఆర్ పదేళ్ల కాలంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి విపక్షాల్ని తన దారికి తెచ్చుకోవటానికి.. రాజకీయ ప్రతీకారాన్ని తీర్చుకునే అస్త్రంగా మార్చారన్న వాదనకు బలం చేకూరేలా ఆధారాలు లభ్యమవుతున్నాయి.

ట్యాపింగ్ ఎపిసోడ్ ను చూస్తే.. ప్రభుత్వంతో సంబంధం లేకుండా పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారన్న భావన కలిగేలా.. తమ జోక్యంతో దాన్నో రాజకీయ అంశంగా మార్చలేదన్న భావన కలిగేలా చేశారని చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక స్థాయి చేరే వరకు మౌనంగా ఉన్న రేవంత్ అండ్ కో.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఆ అంశంపై రియాక్టు అవుతున్నారు. ఇదంతా చూస్తే.. మంత్రుల టోన్ మారటం స్పష్టంగా కనిపిస్తుంది. ట్యాపింగ్ అంశంలో రేవంత్ సర్కారు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోందని.. ఈ అంశంపై తాము తీసుకునే చర్యలు ప్రతీకారం తీర్చుకున్నట్లు కాకుండా.. తీవ్రమైన తప్పులకు తగిన శిక్ష విధిస్తున్నామన్న భావన కలిగేలా చేస్తున్నారని చెప్పాలి. చూస్తుంటే.. లోక్ సభ ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు చాలా వేగంగా చోటు చేసుకునే వీలుందని చెప్పక తప్పదు.