తన తలకు రూ.10 కోట్ల వెలకట్టిన స్వామీజీకి ఉదయనిధి స్ట్రాంగ్ రిప్లై!
సనాతన ధర్మం కూడా కరోనా, డెంగ్యూ, మలేరియా లాంటిదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు,
By: Tupaki Desk | 5 Sep 2023 7:19 AM GMTసనాతన ధర్మం కూడా కరోనా, డెంగ్యూ, మలేరియా లాంటిదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, డీఎంకే ప్రభుత్వంలో మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు డీఎంకే పార్టీతో స్నేహ సంబంధాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ప్రకటించాయి. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తెలిపాయి.
ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై అయోధ్యలోని తపస్విచావిని ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస ఆచార్య ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ తల తెస్తే రూ.10 కోట్లు ఇస్తానని ప్రకటించారు. అంతేకాకుండా ఉదయనిధిని చంపడానికి ఎవరూ సాహసించక పోతే తానే అతన్ని కనుగొని చంపేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఒక చేతిలో ఉదయనిధి ఫోటో, మరో చేతిలో అతడి తలను నరుకుతున్న వీడియోను స్వామీజీ చూపించారు. ఈ పని మీరు త్వరగా చేస్తే రూ. 10 కోట్లు ఇస్తాను అంటూ పేర్కొన్నారు.
తన తలపై స్వామీజీ రివార్డు ప్రకటించడంపై ఉదయనిధి స్పందించారు.
ఓ స్వామీజీ తన తల నరికితే రూ. 10 కోట్లు ఇస్తానని ప్రకటించారన్నారు. ఆయన నిజంగా సాధువా, లేక డూప్లికేట్ స్వామీజీనా ? అని ప్రశ్నించారు. ఈ స్వామీజీలకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన తల తీసే బదులు 10 రూపాయల దువ్వెన ఇస్తే నేను తల చక్కగా దువ్వుకుంటాను కదా అంటూ ఎద్దేవా చేశారు.
బెదిరింపులు తమకు కొత్త కాదన్నారు. ఈ బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని వెల్లడించారు. తమిళ భాష కోసం రైలు ట్రాక్ పై తల పెట్టిన కరుణానిధి మనవడిని తాను అని ఘాటుగా రిప్లై ఇచ్చారు.
తన తల దువ్వు కోవడానికి 10 రూపాయల దువ్వెన చాలని.. రూ.10 కోట్లు ఎందుకని పరమహంస ఆచార్యను ఎద్దేవా చేశారు. తమిళనాడులో సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్న పారిశ్రామికవేత్త దాల్మియాస్ కుటుంబం పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఉదయనిధి నేతృత్వంలో డిఎంకె కార్యకర్తలు రైల్వే ట్రాక్‌లపై పడుకుని తమ నిరసనను తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉదయనిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోనని తేల్చిచెప్పారు. తాను సనాతన ధర్మాన్ని మాత్రమే నిర్మూలించాలని చెప్పానని.. హిందువులని కాదని వెల్లడించారు. బీజేపీ నేతలు తన మాటలను వక్రీకరిస్తున్నారని.. హిందువులను తాను చంపేయాలని అన్నట్టు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.