Begin typing your search above and press return to search.

అప్పుడు 20.. ఇప్పుడు 13.. బాలనేరస్థులు ఎందుకు పెరుగుతున్నట్లు?

గతకొన్ని రోజులుగా ఏపీలో వరుసగా నాలుగురు మైనర్ బాలికలపై అత్యాచారాలు, హత్యలూ జరిగిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 July 2024 7:30 AM GMT
అప్పుడు 20.. ఇప్పుడు 13.. బాలనేరస్థులు ఎందుకు పెరుగుతున్నట్లు?
X

గతకొన్ని రోజులుగా ఏపీలో వరుసగా నాలుగురు మైనర్ బాలికలపై అత్యాచారాలు, హత్యలూ జరిగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా నంద్యాలలోని ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్య చేసింది ముగ్గురు మైనర్లు కావడంతో... ఈ సమాజం ఎక్కడికి పోతోంది అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో బాలనేరస్థుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది.. అందుకు గల కారణాలు ఏమిటనే అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

అవును... ప్రస్తుత సమాజంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా నేరాలు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే... సమాజం పట్ల సరైన అవగాహన లేకపోవడంతో పాటు.. విద్యాబుద్దులు నేర్పించడంలో తల్లితండ్రులు, గురువులు విఫలం చెందడం మరో కారణంగా చెబుతున్నారు. ఇదే సమయంలో... సమాచార ప్రసార సాధానల జోరు, పాశ్చాత్య పోకడల ప్రభావం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు.

ఇదే సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా బాలనేరస్థుల పెరుగుదలలో కీలక భూమిక పోషిస్తుందని చెబుతున్నారు. పైగా తొలిసారి తప్పుచేసినప్పుడు సరైన మందలింపు లేకపోవడంతో అదే అదనుగ తీసుకొని పదే పదే నేరాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఫలితంగా తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా... చిన్న చిన్న నేరాలకు అలవాటుపడిన వారు.. సరైన మందలింపు లేక తీవ్ర నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు.

ఫలితంగా... బంగారు భవిష్యత్తుతో భావి భారతాన్ని నిర్మించాల్సిన బాలలు... నేరస్థులుగా మారుతున్నారు. ఓ అధ్యయనం ప్రకారం.. 2022లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలల నేరాల సంఖ్య 912 కాగా.. దీనిలో 41 మంది పిల్లలు అత్యాచారం, మరో 27 మంది హత్యలు చేశారు. ఏటేటా ఇది మరింత పెరుగుతోందని చెబుతున్నారు. ఇదే సమయంలో... 20 ఏళ్లు పైబడినవారికంటే... 13ఏళ్ల లోపు వారికి సంబంధించిన కీలక విషయాలు తెరపైకి వస్తున్నాయి!

గతంలో సగటున 20 ఏళ్లు పైబడిన వాళ్లు చేసే నేరాలు కాస్తా ఇప్పుడు 13 ఏళ్ల లోపు వారు సైతం అవలీలగా చేస్తున్నట్లు నేర చరిత్రలు నిర్ధరిస్తున్నాయని అంటున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... నేరాలు చేసేవారిలో అనాదలు 10శాతం లోపే ఉండగా.. తల్లితండ్రుల వద్ద కాకుండా చుట్టాల వద్ద పెరిగే వారు 90శాతం మంది ఉన్నారని అంటున్నారు.

పైగా పురుషుల కంటే బాలలు చేస్తున్న కొన్ని అత్యాచారాలు మరీ క్రూరంగా, వికృతంగా ఉంటున్నాయని చెబుతున్నారు! ఈ విషయంలో సోషల్ మీడియా, ఇంటర్ నెట్ ల ప్రభావం కీలక భూమిక పోషిస్తుందని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వాలు, సమాజం, తల్లితండ్రులు, గురువులు ఎలాంటి ఆలోచనలు చేయాలనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. తాజా ముచ్చుమర్రి ఘటన దీని ఆవశ్యకతను నొక్కి చెబుతుంది!