మైనారిటీల్లో పోటీ పెరిగిపోతోందా ?
రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటుకోసం మైనారిటీల్లో పోటీ బాగా పెరిగిపోతోంది. మంత్రవర్గంలో 17 మందికి అవకాశముంది.
By: Tupaki Desk | 7 Feb 2024 7:30 AM GMTరేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటుకోసం మైనారిటీల్లో పోటీ బాగా పెరిగిపోతోంది. మంత్రవర్గంలో 17 మందికి అవకాశముంది. ముఖ్యమంత్రి రేవంత్ ను తీసేస్తే మరో 16 మందికి అవకాశముంటుంది. ప్రస్తుత మంత్రివర్గంలో మొత్తం కలిపి 11 మంది మాత్రమే ఉన్నారు. రేవంత్ తో కలిపి ఏడుగురు ఓసీలు, ఇద్దరు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం దొరికింది. ఇక లేనిదల్లా మైనారిటీల నుండే. అందుకనే మైనారిటీల కోటాను కూడా తొందరలోనే భర్తీ చేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారు.
మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన మైనారిటీలందరు ఓడిపోయారు. వీరిలో మాజీమంత్రి షబ్బీర్ ఆలీ, అజహరుద్దీన్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనారిటీలంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది షబ్బీర్ ఆలీ మాత్రమే. పైగా రేవంత్ కష్టకాలంలో ఉన్నపుడు షబ్బీర్ గట్టి మద్దతుదారుడిగా నిలబడ్డారు. అందుకనే ఎన్నికల్లో ఓడిపోయినా వెంటనే ఎంఎల్సీని చేసి మంత్రివర్గంలో తీసుకోవాలని అనుకున్నారు. అయితే అధిష్టానం అంగీకరించలేదు. ఓడిపోయిన వారికి ఎంఎల్సీ పదవి ఇవ్వకూడదని గట్టిగా చెప్పింది.
అందుకనే షబ్బీర్ ను ప్రభుత్వ సలహదారుగా నియమించారు. షబ్బీర్ అడ్డంకి తొలగిపోగానే మైనారిటీల్లో మిగిలిన నేతలు జిల్లాల్లోనే ఉన్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముస్లింల్లో మెజారిటి ఎంఐఎం+బీఆర్ఎస్ కే మద్దతుగా నిలబడ్డారు. అందుకనే మైనారిటీల్లోగట్టి నేతను జిల్లాల నుండే ఎంపిక చేయాలని రేవంత్ అనుకున్నారు. అందుకనే ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లోని నేతలపై ఫోకస్ పెట్టారు. వరంగల్ కు చెందిన డాక్టర్ రియాజ్, కరీంనగర్ కో ఆర్డినేటర్ అజ్జత్, మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్వల్, ఖమ్మం నగర అధ్యక్షుడు జావేద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.
వీరిలో రాయాజ్ కు ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే గడచిన పదేళ్ళుగా నిరుద్యోగ సమస్యలపై డాక్టర్ పెద్ద పోరాటాలే చేశారట. మొన్నటి ఎన్నికల్లో కూడా నిరుద్యోగ జేఏసీ నేతలందరిని బస్సుల్లో రాష్ట్రమంతా తిప్పి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊరూరా వ్యతిరేక ప్రచారం చేయించారు. పోరాటాల ఫలితంగా రియాజ్ పై అప్పటి ప్రభుత్వం చాలా కేసులు పెట్టి రిమాండుకు కూడా పంపిందట. అందుకనే మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే రాయాజ్ ఎంఎల్సీ పదవికి నూరుశాతం అర్హుడని పార్టీలో చర్చ జరుగుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.