డ్రైవర్ని.. ఎమ్మెల్సీ అయ్యా.. టీ మండలిలో ఎమోషనల్ సీన్
తాను కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీనని తొలిసారి మాట్లాడుతున్న విషయాన్ని చెప్పిన ఆయన కాసేపు ఎమోషనల్ అయ్యారు
By: Tupaki Desk | 4 Aug 2023 5:23 AM GMTఆ మధ్య స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థిగా మీర్జా రాహమత్ బేగ్ రంగంలోకి దిగటం.. అధికార బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించటంతో ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం తెలిసిందే. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన అతడికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఆయనపై పోటీకి స్వతంత్ర అభ్యర్థి వేసిన నామినేషన్ చెల్లదని అధికారులు తేల్చటంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు అధికార ధ్రువీకరణ పత్రం తీసుకొని.. ప్రమాణస్వీకారం చేసినప్పటికీ.. సభలో మాట్లాడే ఛాన్స్ తాజాగా లభించింది. గురువారం నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మండలిలో జరిగిన చర్చలో మాట్లాడిన మీర్జా రహమత్.. తొలి ప్రసంగంలోనే అందరి చూపు తన మీద పడేలా చేశారు. ఆ రీతిలో ఆయన మాటలు ఉన్నాయి.
తాను కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీనని.. తొలిసారి మాట్లాడుతున్న విషయాన్ని చెప్పిన ఆయన కాసేపు ఎమోషనల్ అయ్యారు. తాను డ్రైవర్ గా పని చేసే వాడినని.. ఆ విషయాన్ని ఒప్పుకోవటం పెద్ద విషయం కాదన్న మీర్జా రహమత్.. ''అల్లా నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేనేదో పెద్దవాడిని అయ్యానని భావించను. ప్రజల మనిషిని. వారితో కలిసి ఉంటాను. ప్రాణాలు ఉన్నంతవరకు వారికి సేవ చేస్తాను' అని వ్యాఖ్యానించారు.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పాతబస్తీలో రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బ తిన్నాయని.. వాటి మరమ్మత్తులకు రూ.వెయ్యి కోట్లు కావాలని.. విద్యుత్ సిబ్బందిని మరింత పెంచాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. రోడ్ల మధ్యలో పడిన గుంతల కారణంగా నిత్యం పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటి కారణంగా ప్రాణాలు పోతున్న ఉదంతాలున్నాయి.