ఉండవల్లికి కొత్త ఫ్రెండ్ మిధున్ రెడ్డి...శతృవు మాత్రం?
తెలుగు రాష్ట్రాలలో మార్గదర్శి కేసు అంటే ఆ సంస్థను స్థాపించిన రామోజీరావుతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం టక్కున గుర్తుకు వస్తారు.
By: Tupaki Desk | 22 Aug 2024 3:49 AM GMTతెలుగు రాష్ట్రాలలో మార్గదర్శి కేసు అంటే ఆ సంస్థను స్థాపించిన రామోజీరావుతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం టక్కున గుర్తుకు వస్తారు. ఎక్కడ మార్గదర్శి కేసు. ఎప్పటి కేసు అది. 2006 నుంచి ఎంతో ఓపికగా ఈ కేసులో ఉండవల్లి పోరాడుతున్నారు. ఇప్పటికి దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఈ కేసు అలా సాగుతూనే ఉంది.
లేటెస్ట్ గా మరోమారు ఈ కేసు వెలుగు చూసింది. మార్గదర్శి సేకరించిన డిపాజిట్లు అన్నీ అక్రమమే అని ఆర్బీఐ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసు ఈ విధంగా ఉంటే మార్గదర్శి విషయంలో ఏపీ తెలంగాణా ప్రభుత్వాలు తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోరుతున్నారు.
హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ స్పందించాలని ఆయన అ కోరారు. ఒక వేళ ప్రభుత్వాలు స్పందించకపోతే కేసు విచారణ ఆలస్యం అవుతుందే తప్ప అన్యాయం జరగదు అని ఆయన అనడం విశేషం.
మరో వైపు ఉండవల్లి పోరాటానికి వైసీపీ ఎంపీ ఒకరు అనూహ్యంగా మద్దతు ఇచ్చారు. లోక్ సభలో ఆ పార్టీ నేత అయిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మార్గదర్శి కుంభకోణం దేశంలోనే అతి పెద్దది అని అన్నారు. దీని మీద తాను పార్లమెంట్ లో లేవనెత్తుతాను అని ఆయన చెప్పడం విశేషం.
ఆర్బీఐ కూడా మార్గదర్శి వ్యవహారాన్ని తప్పుపడుతూ కోర్టుకు వెళ్ళింది అని ఆయన గుర్తు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సహా అనేక అక్రమాలను తాను బయటపెడతాను అని ఆయన అంటున్నారు. ఆయన మీద వరసబెట్టి ఒక టీడీపీ అనుకూల మీడియా వ్యతిరేక కధనాలు రాస్తోందని మిధున్ రెడ్డి ఆగ్రహించారు. తాను అందరి గుట్టూ పార్లమెంట్ వేదికగా విప్పుతాను అని అంటున్నారు. మొత్తానికి ఉండవల్లి ఏ ఉద్దేశ్యంతో మార్గదర్శి మీద పోరాటం మొదలెట్టారో తెలియదు కానీ ఇపుడు ఆయనకు వైసీపీ ఎంపీ తోడు అయ్యారు. మరి దీని ఫలితాలూ పర్యవశానాలు ఏమిటి అన్నది చూడాల్సిందే.