మంత్రి మద్దతన్నాడు.. కానీ ఎమ్మెల్సీ తెలియదన్నాడు
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మిశ్రమ ఫలితాలు రావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 4 March 2025 3:10 PM ISTఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మిశ్రమ ఫలితాలు రావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గుంటూరు-కృష్ణ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆలపాటి రాజా రికార్డు మెజారిటీతో గెలవడం ప్రభుత్వానికి ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక్కడ కాపు ఓటర్లు అధికార పార్టీలకు వ్యతిరేకం అవుతున్నారంటూ ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో ప్రచారం జరిగింది కానీ.. ఆలపాటి భారీ మెజారిటీతో గెలిచి అందరినీ సైలెంట్ చేసేశారు. ఐతే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయం ఖాయం అనుకున్న కూటమి ప్రభుత్వానికి అక్కడ షాక్ తగిలింది. ఇక్కడ మొదటి నుంచి పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ముందంజలో కొనసాగుతూ వచ్చారు. చివరికి ఆయనే ఘనవిజయం సాధించారు. తెలుగుదేశం, జనసేన కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మకి ఓటమి తప్పలేదు.
ఐతే ఫలితం వెల్లడి కాగానే మంత్రి అచ్చెన్నాయుడు మీడియా ముందుకు వచ్చి తాము రఘువర్మతో పాటు గాదెకు కూడా మద్దతు ఇచ్చినట్లు ప్రకటించుకున్నారు. వైసీపీ అనుకూల మీడియా ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. ఐతే అచ్చెన్నాయుడు మాటలకు గాదె విలువ లేకుండా చేసేశారు. గెలుపు సంబరాల్లో ఉన్న ఆయన్ని మీడియా వాళ్లు కూటమి ప్రభుత్వ మద్దతు గురించి ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదన్నట్లు మాట్లాడారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని.. తనను టీచర్లు గెలిపించారని అన్నారు. టీడీపీ, జనసేన మద్దతు గురించి అచ్చెన్నాయుడి వ్యాఖ్యల గురించి అడిగితే.. ఏమో దాని గురించి నాకు తెలియదు అంటూ ఆయన సమాధానం దాటవేశారు. ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామమే. ఐతే ప్రభుత్వ మద్దతు ఉన్న అభ్యర్థి ఓడిపోయాడంటూ వైసీపీ మరీ సంతోషపడడానికి కూడా అవకాశం లేదు. ఆ పార్టీ పరోక్ష మద్దతు ఉన్న అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమై, మరీ తక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. కానీ గాదె గెలుపు మాత్రం కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిదే.