Begin typing your search above and press return to search.

మోడీ ముందు ఎంపీలతో పరేడ్ అంటున్న స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పట్టు వదలని విక్రమార్కుడి గా కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 March 2025 7:42 AM
Stalin Meeting With PM Modi
X

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పట్టు వదలని విక్రమార్కుడి గా కనిపిస్తున్నారు. ఆయన డీలిమిటేషన్ వ్యవహరంలో ఎక్కడా తగ్గడం లేదు. గత కొంతకాలంగా ఆయన ఇదే ఇష్యూ మీద సీరియస్ గానే పోరాటం చేస్తూ వస్తున్నారు

తాజాగా దక్షిణాదికి చెందిన సీఎంలు కీలక రాజకీయ పార్టీల నేతలతో ఆయన అతి ముఖ్య సమావేశం పెట్టి సౌత్ వార్ కి తెర తీశారు. డీలిమిటేషన్ వ్యవహారంలో సౌత్ అంతా ఒక్కటే అని కేంద్రానికి నిరూపించారు. ఇపుడు చూస్తే ఆయన మరో వ్యూహాన్ని రూపొందిస్తున్నారు.

అదేంటి అంటే డీలిమిటేషన్ వల్ల తమిళనాడుకు దక్షిణాదికి ఎంత నష్టమో నేరుగా ప్రధాని నరేంద్రమోడీకే వివరించబోతున్నారు. అందుకోసం ఆయన తమిళనాడుకు చెందిన 39 మంది ఎంపీలతో ప్రధానిని కలవబోతున్నారు. ఈ విషయం స్వయంగా స్టాలిన్ మీడియాకు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీతో తొందరలోనే తామంతా కలవబోతున్నామని అన్నారు. ఇటీవల ముగిసిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అందచేస్తామని చెప్పారు. తమ బాధలను ప్రధానికి చెబుతామని అన్నారు.

డీలిమిటేషన్ తో తమకు తీరని నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. అందువల్ల తమ పోరాటం ఎక్కడా ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ పోరులో తామే కచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే స్టాలిన్ తమిళనాడు నుంచి 39 మంది ఎంపీలతో ప్రధానిని కలవాలనుకోవడం రాజకీయంగా అతి పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది.

ఒక దక్షిణాది రాష్ట్రం నుంచి డీలిమిటేషన్ ఇష్యూ మీద ఇంత పెద్ద ఎత్తున ఎంపీలు కలిస్తే అది జాతీయ స్థాయిలోనూ చర్చగా మారుతుంది. అంతే కాదు కేంద్రం ఆలోచనలోనూ మార్పు రావచ్చు అని అంటున్నారు. బీజేపీకి ఈ రోజున దక్షిణాది మీద ఫోకస్ ఉంది. ఈ కీలక సమయంలో అనుకూల వాతావరణాన్ని పాడుచేసుకోదని అంటున్నారు.

దాంతోనే స్టాలిన్ కూడా ప్రధానిని కలసి సమస్యలు చెబితే అంతా సానుకూలం అవుతుందని ధీమాగా ఉన్నారు. అయితే అంతా బాగానే ఉన్నా స్టాలిన్ 39 మంది ఎంపీలతో వస్తాను అంటే ప్రధాని ఆఫీసు అపాయింట్మెంట్ ఇస్తుందా అన్నది. ఒకవేళ ఇస్తే ఒక రకంగా ఇవ్వకపోతే మరో రకంగా రాజకీయం ఉండొచ్చు. సో బీజేపీ పెద్దలకు చిక్కులలో పడేసేలా స్టాలిన్ వ్యూహం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. స్టాలిన్ మోడీతో ఎపుడు ఈ కీలక భేటీని నిర్వహిస్తారో ఆ ముహూర్తం ఎపుడో.