Begin typing your search above and press return to search.

ఆఫీస్ బాయ్ సహా 12మందికి కార్లు గిఫ్ట్... దీపావళి కానుకలు కాదు!

వివరాళ్లోకి వెళ్తే... హరియాణాలోని పంచకులలోని మిట్స్‌ హెల్త్‌ కేర్‌ ఫార్మా సంస్థ డైరెక్టర్‌ ఎంకే భాటియా తన ఉద్యోగులకు టాటా పంచ్‌ కార్లను కానుకగా అందజేశారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 4:16 AM GMT
ఆఫీస్  బాయ్  సహా  12మందికి కార్లు గిఫ్ట్... దీపావళి కానుకలు కాదు!
X

నెలంతా కష్టపడినా సరైన సమయానికి జీతం రాళ్లు ఇవ్వడానికే ఓ పులుపెక్కిపోయే సంస్థలు చాలానే ఉన్న సంగతి తెలిసిందే! ఒకటో తేదీకి జీతం రాళ్లు చేతిలో పడితే సదరు ఉద్యోగికి కలిగే ఆనందం చూడటం వారికి ఏమాత్రం ఇష్టంగా ఉండదేమో! ఫలితంగా... వారికి వీలు దొరికినప్పుడు జీతాలు ఇస్తుంటారు! అది కూడా "బొండు మల్లెలు" కథలోని మల్లెపూలమ్మే తాత క్యారెక్టర్ టైపులో! అయితే... ఉద్యోగుల నిబద్దతను, కష్టాన్ని, నిజాయితీని గుర్తించే సంస్థలు.. వారికి తగిన గుర్తింపు, విలువ, కంఫర్ట్స్ ఇచ్చే సంస్థలు కూడా ఉంటాయి. అలాంటి సంస్థ విషయమే తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల నిబద్ధత, పనితీరును గుర్తించిన ఓ సంస్థ వారికి కార్లను బహుమతిగా ఇచ్చింది. పైగా వారందరినీ ఉద్యోగులుగా కాకుండా, సెలబ్రెటీలు అని కొనియాడింది. ఇదే సమయంలో ఈ బహుమతులను దీపావలి గిఫ్ట్స్ గా చూడొద్దని, బోనస్ లు కాదని.. కంపెనీపై తన ఉద్యోగులు చూపించిన నిబద్ధత, విశ్వాసానికి బహుమతులని యాజమాన్యం చెపుతుండటం గమనార్హం.

వివరాళ్లోకి వెళ్తే... హరియాణాలోని పంచకులలోని మిట్స్‌ హెల్త్‌ కేర్‌ ఫార్మా సంస్థ డైరెక్టర్‌ ఎంకే భాటియా తన ఉద్యోగులకు టాటా పంచ్‌ కార్లను కానుకగా అందజేశారు. మంచి పనితీరు కనబరిచిన 12మందికి ఈ కార్లను గిఫ్ట్స్ గా ఇచ్చారు. భవిష్యత్తులో మరికొందరికి కార్లను బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అయితే... కార్లను గిఫ్ట్‌ గా పొందిన వారి జాబితాలో ఆఫీస్‌ బాయ్‌ కూడా ఉండటం విశేషం.

ఇప్పుడు కార్లు గిఫ్ట్ గా పొందినవారంతా కఠోర శ్రమ, అంకితభావం, విధేయతతో పనిచేసి కంపెనీ ఎదుగుదలకు సహకరించారని భాటియా ప్రశంసించారు. కార్లను గిఫ్ట్‌ గా పొందినవారిలో కొందరు కంపెనీ ప్రారంభించినప్పటి నుంచీ తన వెంటే ఉన్నారని తెలుస్తుంది. అయితే, ఈ కార్లను గిఫ్ట్‌ లుగా పొందిన వారిలో కొందరు ఉద్యోగులకు కారు ఎలా నడపాలో తెలియకపోవడం గమనార్హం. ఊహించని ఈ ఆనందంతో తగిలిన షాక్ నుంచి ఇంకా చాలామంది తేరుకోలేదని అంటున్నారు!

ఈ విషయాలపై స్పందించిన భాటియా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ఉద్యోగులు తమను తాము సెలబ్రిటీగా, ప్రత్యేకంగా ఫీల్‌ అవ్వాలని తాను కోరుకున్నట్లు తెలిపారు. సానుకూల ఆలోచన వల్లే ఇది జరిగిందని.. తన కంపెనీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందని.. కానీ ఈ ఉద్యోగులంతా తన వెంటే ఉండి కంపెనీ ఎదుగుదలకు సహకరించారని.. తన దృష్టిలో వాళ్లంతా తన స్టార్‌ లు అని కొనియాడారు.

ఇదే క్రమంలో... భవిష్యత్తులో తన సంస్థలోని ఉద్యోగులకు బహుమతులుగా ఇచ్చే కార్ల సంఖ్యను 12 నుంచి 50కి పెంచే ఆలోచన ఉందని ఈ సందర్భంగా భాటియా చెప్పడం గమనార్హం. అయితే ఈ కార్లను ఆయన నెల రోజుల క్రితమే ఉద్యోగులకు అందజేసి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. కానీ... ఈ వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఇక కారు విషయానికి వస్తే.. గిఫ్ట్‌ గా ఇచ్చిన టాటా పంచ్‌ కారు రేంజ్‌ రూ.6లక్షల నుంచి ప్రారంభమవుతుంది!