Begin typing your search above and press return to search.

రాతపూర్వకంగా వివరణ ఇచ్చిన కొలికపూడి!

కాగా, ఈ నెల 11న ఏ.కొండూరు మండలం గోపాలపురంలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వైసీపీకి చెందిన గిరిజన కుటుంబంపై చేయిచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   20 Jan 2025 10:55 AM GMT
రాతపూర్వకంగా వివరణ ఇచ్చిన కొలికపూడి!
X

టీడీపీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి రాతపూర్వక వివరణ ఇచ్చారు. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా ప్రకటించారు. అత్యంత వివాదాస్పద వ్యవహారశైలితో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన కొలికపూడిపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన దూకుడు వల్ల ఓ గిరిజన మహిళ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పార్టీకి చెడ్డ పేరు వస్తోందని భావించిన టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే కొలికపూడి నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ ఆధ్వర్యంలో కమిటీ కొలికపూడి నుంచి వివరణ తీసుకుంది.

అయితే తనపై జరుగుతున్న ప్రచారం అంతా సోషల్ మీడియా కల్పితమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. తనపై ఫిర్యాదు చేశారని చెబుతున్న వారంతా తనతో కలిసి పనిచేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో వచ్చేది వేరు.. జరిగిన వాస్తవం వేరు. గోపాలపురంలో కంచె తొలగింపు ఘటన అనుకోకుండా జరిగింది. కంచె ఉన్న విషయం అక్కడికి వెళ్లేవరకు తనకు తెలియదని ఎమ్మెల్యే వివరించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎవరూ దూరం పెట్టరు. తిరువూరు ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు అంటూ కొలికపూడి వివరణ ఇచ్చారు.

కాగా, ఈ నెల 11న ఏ.కొండూరు మండలం గోపాలపురంలో పర్యటించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వైసీపీకి చెందిన గిరిజన కుటుంబంపై చేయిచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గ్రామానికి చెందిన టీడీపీ నేత భూక్యా రాంబాబు, ఆయనకు సోదరుడి వరుస అయ్యే వైసీపీ గ్రామస్థాయి నేత భూక్యా క్రిష్ణకు ఎప్పటి నుంచో భూ వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల గ్రామంలో రోడ్డు నిర్మించగా, స్థలం వివాదం జరిగే వరకు తన భూమిలో రోడ్డు వాడకూడదని భూక్య క్రిష్ణ రోడ్డుకు అడ్డంగా కంచె వేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి వైసీపీ నేత కుటుంబాన్ని మందలించినట్లు చెబుతున్నారు. అయితే ఎమ్మెల్యే తన భర్తను కొట్టారని ఆరోపిస్తూ భూక్యా క్రిష్ణ సతీమణి చంటి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. దీనిపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను క్రమశిక్షణ సంఘానికి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఎమ్మెల్యే వివరణ పట్ల క్రమశిక్షణ సంఘం విచారించి నిర్ణయం తీసుకోవాల్సివుంది. టీడీపీలో ఎంతటి వారైనా క్రమశిక్షణతో మెలగాలని పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు. క్రమశిక్షణ సంఘంలో వర్ల రామయ్యతోపాటు ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీకి అర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే వివరణ తీసుకున్నాక మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయన్నారు. పార్టీ అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా మెలగాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు. ఆయన వ్యవహారశైలిని మార్చుకోవాలని సూచించారు. కాగా, కొలికపూడిపై క్రమశిక్షణ సంఘం నివేదిక సమర్పించాక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోనున్నారు.