ఎమ్మెల్యేల జీతాలు : దేశంలో ఏ రాష్ట్రం ముందుందో తెలుసా..?
ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎమ్మెల్యేల జీతాలను ఏకంగా వంద శాతం పెంచేందుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 27 March 2025 3:30 PMఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎమ్మెల్యేల జీతాలను ఏకంగా వంద శాతం పెంచేందుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో కర్ణాటక ఎమ్మెల్యేల జీతం ఒక్కసారిగా రెట్టింపు కానుంది. అయితే, మన తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంత సంపాదిస్తున్నారో మీకు తెలుసా? దేశంలోనే అత్యధికంగా ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తున్న రాష్ట్రం ఏది? అతి తక్కువ వేతనం అందుకుంటున్న ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక నివేదిక ప్రకారం.. ఒక్కో రాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతం ఒక్కో విధంగా ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలోని ఎమ్మెల్యేలు నెలకు దాదాపు రూ. 2.5 లక్షల వరకు జీతం పొందుతున్నారని సమాచారం. ఇది నిజంగా షాకింగ్ విషయమే. కానీ, మరోవైపు కేరళ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల నెల జీతం కేవలం రూ. 70,000 మాత్రమే ఉండటం గమనార్హం.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మహారాష్ట్రలోని ఎమ్మెల్యేల ప్రాథమిక వేతనం (బేసిక్ శాలరీ) రూ. 1.82 లక్షలు కాగా, కేరళలోని ఎమ్మెల్యేల బేసిక్ శాలరీ కేవలం రూ. 2 వేలు మాత్రమే! ఈ వ్యత్యాసాన్ని చూస్తే, ఒక్కో రాష్ట్రంలో ఎమ్మెల్యేల వేతనాలు ఏ స్థాయిలో మారుతూ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
మహారాష్ట్రలోనే అత్యధికం:
ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా ఎమ్మెల్యేలకు జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ. 1,82,200 ప్రాథమిక వేతనంతో పాటు పలు రకాల అలవెన్సులు అందుతాయి. వాటిలో ముఖ్యంగా డియర్ అలవెన్స్ రూ. 51,016, టెలిఫోన్ అలవెన్స్ రూ. 8,000, స్టేషనరీ పోస్టేజ్ అలవెన్స్ రూ. 10,000, కంప్యూటర్ ఆపరేటర్ అలవెన్స్ రూ. 10,000 ఉంటాయి. అంతేకాకుండా, ప్రతి ఎమ్మెల్యేకు రోజువారీ అలవెన్సు కింద రూ. 2 వేలు లభిస్తాయి.
ఉత్తర్ ప్రదేశ్ పరిస్థితి:
ఉత్తర్ ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ. 96,500 జీతంగా చెల్లిస్తోంది. దీనితో పాటు నియోజకవర్గ అలవెన్సు కింద రూ. 50 వేలు, సెక్రటేరియల్ అలవెన్సు రూ. 20,000, ట్రావెల్ అలవెన్సు రూ. 1,500 అందుతాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ప్రతి ఎమ్మెల్యేకు రోజుకు రూ. 2 వేలు అదనంగా లభిస్తాయి.
పంజాబ్ లో ఇలా:
పంజాబ్ రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యేకు నెలకు స్థిర వేతనం రూ. 25 వేలు ఉంటుంది. దీనితో పాటు నియోజకవర్గ అలవెన్సు కింద రూ. 25,000, సెక్రటేరియల్ , పోస్టల్ అలవెన్సు కింద రూ. 15,000, టెలిఫోన్ అలవెన్సు రూ. 15 వేలు, కార్యాలయ నిర్వహణ కోసం రూ. 10 వేలు అలవెన్సులుగా అందుతాయి.
మొత్తానికి చూస్తే, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీతాలు భారీగా మారుతూ ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా ఉండగా, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయి. ఈ వ్యత్యాసాలకు గల కారణాలు ఏమైనప్పటికీ, ప్రజా ప్రతినిధుల వేతనాల విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానం లేకపోవడం గమనార్హం.