Begin typing your search above and press return to search.

గంజాయి వినియోగిస్తూ దొరికిన మహిళా ఎమ్మెల్యే కొడుకు

ఇంతకీ ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు? ఆమె ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

By:  Tupaki Desk   |   30 Dec 2024 10:21 AM GMT
గంజాయి వినియోగిస్తూ దొరికిన మహిళా ఎమ్మెల్యే కొడుకు
X

స్నేహితులతో గంజాయి దమ్ము కొడుతూ పోలీసులకు దొరికిన ఒక ప్రముఖుడి కొడుకు యవ్వారం కేరళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పోలీసులు కేసు పెట్టినప్పటికి.. తన కొడుకు సుద్దపూసగా సదరు మహిళా ఎమ్మెల్యే బల్లగుద్ది వాదించటమే కాదు.. ఫేస్ బుక్ లైవ్ లోనూ అదే వాదనను వినిపించటం ఇప్పుడా రాష్ట్రంలో దుమారంగా మారింది. ఇంతకీ ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు? ఆమె ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

కేరళలోని కాయంకుళం సీపీఎం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు యు ప్రతిభ. ఆమె కుమారుడు.. తన స్నేహితులతో కలిసి అలప్పుజా జిల్లా కుట్టనాడ్ లోని తకాజిలో గంజాయితో ఎక్సైజ్ పోలీసులకు దొరికిపోయాడు. కొంతమంది యువకులు కలిసి గంజాయి సేవిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఎమ్మెల్యే కుమారుడితో పాటు తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లుగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. పులిముగం బోట్ జెట్టీ సమీపంలో గంజాయిని వినియోగిస్తుండగా తాము పట్టుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. వీరి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. అయితే.. స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణం చిన్నదిగా తెలుస్తోంది. మహిళా ఎమ్మెల్యే ప్రతిభ కుమారుడు కనీవ్ ను ఈ ఉదంతంలో ఏ9గా చూపించారు. వీరిపై నార్కోటిక్ డగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్టు లేదంటే ఎన్ డీపీఎస్ యాక్టు సెక్షన్ 27కింద కేసు నమోదు చేశారు. అయితే.. వీరు బెయిల్ పై విడుదలయ్యారు.

తాజా ఉదంతంపై సోమవారం అధికారులు ఎక్సైజ్ కోర్టుకు రిపోర్టును ఇవ్వనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు స్థానికులను సాక్ష్యులుగా చేర్చారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లుగా అధికారులు చెప్పగా.. తన కొడుకును గంజాయి సేవిస్తుంటే అరెస్టు చేశారన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని ఎమ్మెల్యే ప్రతిభ వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఆమె ఖండించారు. ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన ఆమె.. తన కొడుకు తన ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు మాత్రమే అధికారులు ప్రశ్నించారే తప్పించి.. ఇంకేం జరగలేదని పేర్కొన్నారు. మీడియానే అనవసరంగా రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు. తన కొడుకు గంజాయితో పట్టుబడలేదని.. ఒకవేళ తాను చెబుతున్నది తప్పని తేలితే క్షమాపణలు చెబుతారని.. లేనిపక్షంలో మీడియా బహిరంగ క్షమాపణ చెబుతుందా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం కేరళలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.