Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో 50 మంది దాడి చేశారంటూ ఎమ్మెల్యే కన్నీరుమున్నీరు!

అవును... రాజస్థాన్ అసెంబ్లీలో తనపై దాదాపు 50 మంది దాడి చేశారని.

By:  Tupaki Desk   |   24 July 2023 4:24 PM GMT
అసెంబ్లీలో 50 మంది దాడి చేశారంటూ ఎమ్మెల్యే కన్నీరుమున్నీరు!
X

ఈమధ్య కాలం లో అసెంబ్లీలో జరగకూడదని సంగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజాసమస్యల పై చర్చించాల్సిన అసెంబ్లీలో, శాసనాలు చేయాల్సిన శాసన సభలో నీలి చిత్రాలు చూస్తున్న ప్రజాసేవకుల చిత్రాలు కూడా దర్శనమిస్తున్నాయి.

ఈ క్రమంలో తాజాగా తనను అసెంబ్లీలో పెట్టి కొట్టారంటూ ఒక ఎమ్మెల్యే కన్నీరు మునీరు అవుతూ చెబుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తనను కాంగ్రెస్ పార్టీ సభ్యులు కొట్టారని, పిడిగుద్దులు గుద్దారని ఆరోపిస్తున్నారు ఒక ఎమ్మెల్యే.

అవును... రాజస్థాన్ అసెంబ్లీలో తనపై దాదాపు 50 మంది దాడి చేశారని.. పిడిగుద్దులు కురిపించారని.. ఇటీవల మంత్రి పదవి పోగొట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్‌ గుడా ఏడుస్తూ తెలిపారు. కాంగ్రెస్ నేతలు తనను అసెంబ్లీ నుంచి బయటకు లాగిపడేశారని ఆయన ఆరోపిస్తున్నారు.

రాజస్థాన్ అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు రాజేంద్ర సింగ్. తాను బీజేపీ తో కలిశానని ఆరోపణలు చేస్తున్నారని.. అసలు తాను చేసిన తప్పేంటో చెప్పాలని కన్నీరు పెట్టుకున్నారు. తన వద్ద రెడ్ డైరీ ఉందని, సీఎం అశోక్ గహ్లోత్ కు సంబంధించిన నగదు లావాదేవీల గురించి అందులో ఉందని ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం.

అసలేమి జరిగిందంటే… రాజస్థాన్‌ లో సొంత ప్రభుత్వంపైనే అసెంబ్లీలో విమర్శలు చేసి మంత్రి పదవి పోగొట్టుకున్న రాజేంద్ర సింగ్‌ గుడా.. ఇవాళ మరోసారి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్‌ తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే రఫీఖ్‌ ఖాన్‌, ఇతర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజేంద్ర సింగ్‌ ను చుట్టుముట్టారు.

వెంటనే రాజేంద్ర సింగ్‌ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ఈ పద్ధతి మంచిది కాదని వారించిన స్పీకర్‌ సీపీ జోషితోనూ వాగ్వాదానికి దిగారు. దాంతో స్పీకర్‌ మార్షల్స్‌ ను పిలిపించి రాజేంద్రను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. తరువాత సభను వాయిదా వేశారు.

ఈ ఘటన పై రాజేంద్ర సింగ్‌ గుడా విలేకరులతో మాట్లాడారు. మంత్రులతో సహా పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చుట్టుముట్టి తనపై ముష్టిఘాతాలు కురిపించారని.. సభలోనే తనపై చేయి చేసుకున్నారని.. తీవ్రంగా కొట్టారని ఆరోపిస్తున్నారు.

కాగా, మంత్రిగా ఉంటూ.. సొంత సర్కారు పై అసెంబ్లీలో రాజేంద్ర సింగ్‌ గుడా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆయన మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీకి హాజరైన ఆయన.. మంత్రి శాంతి ధరివాల్‌ తో తీవ్ర వాగ్వాదానికి దిగారు! ఈ సందర్భంగా ఈ వ్యవహారం జరిగిందని తెలుస్తోంది!