Begin typing your search above and press return to search.

అర్థరాత్రి వేళ అచ్చంపేటలో ఏమైంది? గువ్వలకు అస్వస్థత!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గతంలో చోటు చేసుకోని కొత్త ఉద్రిక్త వాతావరణం తాజాగా చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   12 Nov 2023 10:39 AM IST
అర్థరాత్రి వేళ అచ్చంపేటలో ఏమైంది? గువ్వలకు అస్వస్థత!
X

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గతంలో చోటు చేసుకోని కొత్త ఉద్రిక్త వాతావరణం తాజాగా చోటు చేసుకుంది. అందుకు తగ్గట్లే శనివారం అర్థరాత్రి వేళలో అచ్చంపేటలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అధికార బీఆర్ఎస్ వారు డబ్బులు పంచుతున్నారన్న ప్రచారం తాజా ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఆందోళనకు దిగటం.. అక్కడకు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరి పోటాపోటీ నినాదాలకు పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారన్న అనుమానంతో అర్థరాత్రి వేళలో అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో చోటు చేసుకున్న ఉద్రిక్త వాతావరణం ఎలా మొదలైందన్న విషయంలోకి వెళితే.. ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గేట్ వద్ద ఒక వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. కానీ.. ఆ వాహనాన్ని మాత్రం ఆపలేదు. దీంతో ఆ వాహనాన్ని ఫాలో అయ్యారు.

అచ్చంపేట అంబేడ్కర్ సర్కిల్ వద్దకు వచ్చేసరికి దాన్ని అడ్డుకొని రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన వారు పోటీగా నిరసన ప్రదర్శనలు మొదలు పెట్టారు. ఈ సమాచారం అందుకున్్న కాంగ్రెస్ అభ్యర్థి వంశీ క్రిష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో.. ఉద్రిక్తత మరింత ఎక్కువైంది. వాహనంపై దాడి సరికాదని బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఇదిలా ఉంటే అధికార బీఆర్ఎస్ కు పోలీసులు సహకరిస్తారన్న ఆరోపణలతో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు షురూ చేశారు. కాసేపటికే అధికార పార్టీకి చెందిన గువ్వల బాలరాజు స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా పేర్కొంటూ అచ్చంపేట ప్రభుత్వఆసుపత్రికి తరలించారు. ఆయనకు టెస్టులు చేసిన వైద్యులు.. గువ్వల బాలరాజును వెంటనే హైదరాబాద్ కు తరలించాల్సిందిగా వైద్యులు సూచన చేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వాహనంలో డబ్బుల సంచులు తరలిస్తున్న విషయాన్ని కంప్లైంట్ చేస్తున్నాపోలీసులు ఎందుకు స్పందించటం లేదని వంశీక్రిష్ణ ప్రశ్నిస్తున్నారు. గువ్వలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే సానుభూతి కోసం ఇలాంటివి చేస్తున్నారని వంశీక్రిష్ణ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణలకు పోలీసులు స్పందిస్తూ.. కారులో తీసుకెళుతున్నది ఫోటో కెమేరాలకు సంబంధించిన పరికరాలుగా పేర్కొన్నారు. ఒకవేళ అదే అయితే.. వాహనాన్ని ఆపినంతనే.. వారికి పోలీసు స్టేషన్ కు వెళదామని చెప్పి.. పోలీసుల సమక్షంలోనే సంచీల్లోఉన్నవి ఏమిటో చూపిస్తే.. ఈ రచ్చ అంతా ఉండేది కాదన్న మాట వినిపిస్తోంది.