Begin typing your search above and press return to search.

దమ్ముంటే కాంగ్రెసోళ్లు తిరగండి..కాల్చి పారేస్తా.. గులాబీ ఎమ్మెల్యే అతి!

కారణం.. సభలో ఉన్న కొందరు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మర్రి జానార్దన్ రెడ్డి.. వారిని వారించే ప్రయత్నం చేశారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 4:40 AM GMT
దమ్ముంటే కాంగ్రెసోళ్లు తిరగండి..కాల్చి పారేస్తా.. గులాబీ ఎమ్మెల్యే అతి!
X

నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే తనకు మాత్రమే కాదు.. తన పార్టీకి నష్టమన్న చిన్న లాజిక్ ను మిస్ అయిన నేతలతో వచ్చి పడే కష్టాలు.. ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా అలాంటి తప్పే చేశారు గులాబీ ఎమ్మెల్యే ఒకరు. ఎన్నికలు మరికొద్ది వారాల్లోకి వచ్చేసిన వేళ.. రాజకీయ హడావుడి నెలకొన్న వేళ.. తన నోటి నుంచి వచ్చే మాటలు పార్టీకి ఇబ్బందికరంగా మారతాయన్న సింఫుల్ విషయాన్ని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనతో పెట్టుకోవద్దని.. అలా చేస్తే కాంగ్రెసోళ్లకు నష్టమన్న ఆయన.. తాను తలుచుకుంటే.. తన క్యాడర్ కు చెబితే కాంగ్రెసోళ్లు ఒక్కరూ తిరగరంటూ నోరు పారేసుకున్నారు. అక్కడితో ఆగని ఆయన మరింత మాటల దూకుడ్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల ప్రస్థానంలో మర్రన్న పేరుతో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పాదయాత్ర నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలానికి చేరుకుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చసిన సభలో మాట్లాడిన ఆయన.. సహనం కోల్పోయారు. కారణం.. సభలో ఉన్న కొందరు జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మర్రి జానార్దన్ రెడ్డి.. వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జై కాంగ్రెస్ అన్న నినాదాలు ఎక్కువ కావటంతో ఆయన తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

తనతో పెట్టుకుంటే కాంగ్రెస్ కే నష్టమని.. తన క్యాడర్ కు చెబితే కాంగ్రెసోళ్లు ఒక్కరు తిరగలేరని.. వారికి కాల్చి పారేస్తారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 'తాటాకు చప్పుళ్లకు భయపడను. అన్ని కట్టెలలో కాలి వచ్చినోడ్ని.

నా క్యాడర్ కు చెబితే కాంగ్రెసోళ్లు ఒక్కరూ తిరగలేరు. అనవసరంగా రెచ్చగొడుతున్నారు. దమ్ముంటే రేపటి నుంచి తిరగండి. కాల్చి పారేస్తా’ అంటూ నోరు పారేసుకున్నారు. కీలకమైన ఎన్నికలకు కాస్త ముందుగా చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారతాయన్న మాట వినిపిస్తోంది.