మైనంపల్లితో మైలేజీ కంటే మైనస్ అయ్యేదే ఎక్కువ కదా
గత కొద్దికాలంగా ఊహించని రీతిలో బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఓ వైపు ఎన్నికలకు సిద్ధమవుతూనే మరోవైపు అంతర్గత కలహాలను సరిదిద్దుకునే పడిలో పడుతోంది.
By: Tupaki Desk | 2 Oct 2023 1:30 AM GMTగత కొద్దికాలంగా ఊహించని రీతిలో బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఓ వైపు ఎన్నికలకు సిద్ధమవుతూనే మరోవైపు అంతర్గత కలహాలను సరిదిద్దుకునే పడిలో పడుతోంది. అయితే, సీనియర్ల వివాదాలు సద్దుమణుగుతున్నాయన్న తరుణంలో నేతల చేరికతో కలుగుతున్న సమస్యలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఎపిసోడ్ ఇటు నియోజకవర్గంలో అటు మెదక్ జిల్లాలో రచ్చకు కారణం అవుతోంది.
మైనంపల్లి గులాబీ గూటిని వీడి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో ఆయనకు టికెట్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పెద్దలు సైతం ఇదే మాట చెప్తుండటంతో... ఇన్నాళ్లు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా ఉంచిన బీసీ నేత నందికంటి శ్రీధర్ ఘాటుగా స్పందించారు. అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నందికంటి శ్రీధర్...ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనకు టిక్కెట్ ఇవ్వకుండా మైనంపల్లి హన్మంతరావుకి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో తానే పోటీలో తానే పోటీలో ఉంటానని తేల్చిచెప్పడమే కాకుండా టిక్కెట్ ఇవ్వకపోతే తన తడఖా చూపిస్తానని బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మల్కాజ్‌గిరి నియోజకవర్గ కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది.
మరోవైపు మైనంపల్లి తన తనయుడు రోహిత్ పొలిటికల్ ఎంట్రీ కోసం సిద్ధం చేసిన మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఈ ప్రచారంపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వ్యతిరేకులకు నాయకత్వం అప్పగించారని పేర్కొంటూ పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే ఇదేనా గుర్తింపు అంటూ వాపోయారు. మైనంపల్లి కుమారుడు రోహిత్‌కు టిక్కెట్ అనే వార్తలు తెలిసిన తర్వాత డబ్బు సంచులే ప్రాతిపదికగా జరుగుతున్న టికెట్ల కేటాయింపు పర్వంలో మనోవేదనకు గురయ్యానని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడితోపాటు.. సోనియా, రాహుల్ మౌనం వహించడం బాధ కలిగిస్తోందని. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నోట్ల కట్టలను నమ్ముకునే వారు నడిబజారులో నవ్వులపాలు అవ్వడం ఖాయమని తిరుపతిరెడ్డి పేర్కొన్నారు.
ఇటు మెదక్ జిల్లాలో అటు మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మైనంపల్లి ఎంట్రీ కాకపుట్టిస్తోంది. ఇద్దరు ముఖ్య నేతలు మైనంపల్లికి, ఆయన తనయుడికి టికెట్ల కేటాయింపును నిరసించడం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏకంగా జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేసేయడం, మల్కాజ్‌గిరి నియోజకవర్గ ఇంచార్జీ తాను బరిలో ఉంటానని ప్రకటించేయడంతో మైనంపల్లి వల్ల ఒనగూరిన ప్రయోజనం కంటే సమస్యలే అధికం అయ్యేలా ఉన్నాయని చర్చ జరుగుతోంది. ఈ సమస్యను కాంగ్రెస్ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి మరి.