Begin typing your search above and press return to search.

వైసీపీకి కూటమి ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్‌!

ఈ నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేసింది

By:  Tupaki Desk   |   26 Jun 2024 11:30 PM GMT
వైసీపీకి కూటమి ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్‌!
X

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, పట్టణాల్లో ఏర్పాటయిన వైసీపీ పార్టీ కార్యాలయాలపై రచ్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత విలువైన స్థలాలను కారుచౌకగా లీజుకు కట్టబెట్టుకుని.. వాటిలో వైసీపీ కార్యాలయాలను ప్యాలెస్ల మాదిరిగా నిర్మిస్తున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేసింది. దీంతో వైసీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పార్టీ కార్యాలయాలకు స్థలాలు ఇస్తూ జీవో జారీ చేశారని గుర్తు చేస్తున్నారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాలన్నీ అనుమతులు లేకుండా విలువైన ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ లో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాలపై విచారణ జరిపిస్తామని డాక్టర్‌ పార్థసారథి హెచ్చరించారు. వాటిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ భవనం విషయంలో విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. అలాగే తప్పుడు పనులు చేసిన అధికారుల మీద చర్యలు తప్పవని హెచ్చరించారు.

వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో వింతలు చోటు చేసుకున్నాయని డాక్టర్‌ పార్థసారథి హాట్‌ కామెంట్స్‌ చేశారు. ప్రపంచంలో ఎక్కడా జరగని వింతలు ఈ ఐదేళ్లలో జరిగాయన్నారు. ఆదోని పట్టణంలోని పాత ఎన్‌జీవో భవనాన్ని 99 ఏళ్లకు వైసీపీ లీజుకు తీసుకుందన్నారు. అది కూడా కేవలం రూ.40 లక్షలకే సొంతం చేసుకుందని ఆరోపించారు. ఇది వింత కాదా అని ఆయన ఎద్దేవా చేశారు.

99 ఏళ్లకు కేవలం రూ. 40 లక్షలు మాత్రమే వైసీపీ లీజు చెల్లిస్తే.. సంవత్సరానికి ఎంత మొత్తం చెల్లిస్తున్నట్టని నిలదీశారు. అలాగే ఇది నెలకు ఎంత మొత్తమని వైసీపీ నేతలను ప్రశ్నించారు. ఎన్‌జీవో భవనాన్ని 99 ఏళ్లకు రూ.40 లక్షలకే దక్కించుకోవడంపై విచారణ జరిపిస్తామని పార్థసారథి హెచ్చరించారు.

ఎన్‌జీవో భవనాన్ని కూల్చేసిన వైసీపీ నేతలు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ లా నిర్మించారని.. అందులో పేకాటలు ఆడటంతోపాటు సెటిల్మెంట్లు చేయడం చేస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో ఆదోని పట్టణంలో పాత ఎన్‌జీఓ భవనాన్ని వైసీపీ కార్యాలయానికి లీజుకు ఇచ్చిన అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు.