Begin typing your search above and press return to search.

బీఆరెస్స్ అనూహ్య నిర్ణయం... కాంగ్రెస్ లో వారికి కొత్త టెన్షన్!?

అవును... ప్రస్తుతం తెలంగాణలో బీఆరెస్స్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు

By:  Tupaki Desk   |   24 Jun 2024 11:43 AM GMT
బీఆరెస్స్ అనూహ్య నిర్ణయం... కాంగ్రెస్ లో వారికి కొత్త టెన్షన్!?
X

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైనప్పటి నుంచి బీఆరెస్స్ కు వరుస కష్టాలు తలుపుతడుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు శూన్యం కావడంతో పరిస్థితి మరీ దారుణంగా పడిపోయిందని అంటున్నారు. దీనికి తోడు కారు దిగిపోతున్న ఎమ్మెల్యేలతో బీఆరెస్స్ కలవరపడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... ప్రస్తుతం తెలంగాణలో బీఆరెస్స్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. ఇది ఏ పార్టీ చేసినా తప్పే అనేది అంతా చెప్పే మాట! మొన్న కేసీఆర్ చేశారు కాబట్టి.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అనే మాటలు వ్యవస్థను మరింత భ్రష్టుపట్టిస్తాయని అంటున్నారు! పార్టీలు ఫిరాయించడం అంటే ప్రజా తీర్పును అవహేళన చేయడమే అని చెబుతున్నారు. ఈ సమయంలో బీఆరెస్స్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది! ఈ నేపథ్యంలో బీఆరెస్స్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంలో న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేంద్ర అనర్హత పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ విచారణ అనంతరం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందని అంటున్నారు.

దీంతో... తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క... అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ బీఫాం తో గెలిచిన నేతలు.. ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంగతి తెలిసిందే. బీఆరెస్స్ ను ఖాళీ చేయాలనే ఉద్దేశ్యంతోనో ఏమో కానీ... కారు దిగి వస్తున్న నేతలకు వరుసగా కండువాలు కప్పేస్తున్నారు రేవంత్. పోచారం విషయంలో అయితే ఏకంగా ఆయన ఇంటికెళ్లి మరీ కండువా కప్పారు!

శనివారం పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరుకోగా.. ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆరెస్స్ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు తదనంతర పరిణామాలను బట్టి కారు దిగిన ఎమ్మెల్యేలందరిపైనా ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆరెస్స్ భావిస్తోందని తెలుస్తోంది.

సుప్రీం గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం... ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని బీఆరెస్స్ నేతలు చెబుతున్నారు. కాగా... గతంలో బీఆరెస్స్ అధికారంలో ఉండగా... కాంగ్రెస్ నేతలను వరుసగా కారు ఎక్కించేసుకున్న సంగతి తెలిసిందే! అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం ఉంది కదా అని అప్రజాస్వామిక పనులు చేయకూడదు.. అధికారం అశాస్వతం అనే విషయం మరువకూడదు అని అంటున్నారు పరిశీలకులు!