ప్రజా భవన్ ఎదుట యాక్సిడెంట్.. మాజీ గులాబీ ఎమ్మెల్యే కొడుకు అరెస్టు
తాజాగా అతను దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయి ఉన్న నేపథ్యంలో అతడి రాక సమాచారం పోలీసులకు అందింది.
By: Tupaki Desk | 8 April 2024 6:37 AM GMTసంచలనంగా మారిన కేసుకు సంబంధించిన అరెస్టు తాజాగా చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఉదంతం పెను సంచలనంగా మారటం తెలిసిందే. బీఆర్ఎస్ కు చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ అలియాస్ రాహిల్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.
అర్థరాత్రి వేళ మితిమీరిన వేగంతో ప్రజాభవన్ ముందు ఉన్న డివైడర్ ను ఢీ కొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేయాల్సిన పంజాగుట్ట పోలీసులు.. ఆ అంశాన్ని గుట్టుగా ఉంచేసి సెటిల్ చేయటం.. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే.. ఈ అంశం కాస్త ఆలస్యంగా వెలుగు చేసింది. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై.. లోతుగా విచారణ చేపట్టారు. ఈ ఘటనను బయటకు రాకుండా మేనేజ్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవటం వారిని సస్పెండ్ చేయటం తెలిసిందే. అదే సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు మీద కేసు బుక్ చేయటంతో పాటు.. అతడి కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఈ ప్రమాద ఘటన అనంతరం సాహిల్ దుబాయ్ వెళ్లిపోయినట్లుగా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. తాజాగా అతను దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయి ఉన్న నేపథ్యంలో అతడి రాక సమాచారం పోలీసులకు అందింది. అదే సమయంలో పోలీసుల ముందుకు వచ్చిన సాహిల్ లొంగిపోయారు. దీంతో అతన్ని రిమాండ్ కు తరలించారు.