ఏయూలో ఏమి జరుగుతోంది...లోకేష్ వైపే అందరి చూపు
ఆ తరువాత కాలంలో జగన్ సీఎం కావడంతో ప్రసాదరెడ్డ్డి వీసీగా హవా చలాయించారు.
By: Tupaki Desk | 30 Jun 2024 3:58 AM GMTఏపీలోనే అత్యంత ప్రతిష్ట కలిగిన వర్శిటీగా ఏయూని చెబుతారు. అలాంటి ఏయూకి వీసీగా అయిదేళ్ళ పాటు పీవీజీడీ ప్రసాదరెడ్డి పనిచేశారు. ఈయన జగన్ కి ఆప్తుడు అని అంటారు. ఆయన వైసీపీ 2014 నుంచి 2019 మధ్యలో విపక్షంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా కోసం పెట్టిన యువ భేరీ సభలకు హాజరై వివాదస్పదం అయ్యారు.
ఆ తరువాత కాలంలో జగన్ సీఎం కావడంతో ప్రసాదరెడ్డ్డి వీసీగా హవా చలాయించారు. ఆయన హయాంలో ఏయూలో అభివృద్ధి ఎంత మేర సాగిందన్నది పక్కన పెడితే ఘర్షణలు వివాదాలే ఎక్కువగా కనిపించాయి. ఏయూ ప్రక్షాళన పేరుతో ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు విద్యార్థి లోకాన్ని అలాగే అధ్యాపక వర్గాన్ని సైతం మండించేలా చేశాయని అంటారు.
ఏకంగా పదిహేను మందికి పైగా అధ్యాపకులను ఆయన సస్పెండ్ చేశారు అని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏయూలో నిలువ నీడలేకుండాపోయిందని నిధుల దుర్వినియోగం భారీగా జరిగిందని పరీక్షల నిర్వహణ నుంచి అన్నీ అవతతవకలే సాగాయని టీడీపీ కూటమి పక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి.
ఇదిలా ఉంటే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తున్న వేళ నుంచి వీసీ కనిపించలేదని ఆ మధ్యలో ఒకసారి మాత్రమే వచ్చారని ఏయూ పరిరక్షణ కమిటీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏయూ వీసీ చాంబర్ లో కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాన్ని కూడా పెట్టలేదంటే ఏమనుకోవాలని వారు ప్రశ్నించారు. మొత్తమ్మీద ఎన్నో ఆందోళన చేసిన మీదట వీసీ తాజాగా రాజీనామా చేశారు.
ఈ నేపధ్యంలో శనివారం ఏయూలోకి కూటమి నేతలు ఎమ్మెల్యేలు ఎంపీ అంతా కలసి ఒక విధంగా సంబరాలే చేశారు. పాత వీసీ రాజీనామా చేయడం మంచి పరిణామమని వారు అన్నారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామక్రిష్ణబాబు, వంశీ క్రిష్ణ శ్రీనివాస్, ఎంపీ సీఎం రమేష్ తదితరులు ఏయూకి వచ్చారు. ఏయూని ప్రక్షాళన చేస్తామని వారు ప్రకటించారు.
అన్ని రకాలుగా ఏయూ ప్రతిష్టను దిగజార్చిన మాజీ వీసీ పివిజిడి.ప్రసాదరెడ్డిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవాలయం లాంటి ఎయును రాజకీయ కేంద్రంగా మార్చి భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రసాదరెడ్డిపై విచారణ జరిపి శిక్షించాలని గవర్నర్‌ను కోరారు. రాజీనామా చేసినంత మాత్రాన ప్రసాదరెడ్డిని, ఆయన అరాచకాల్లో భాగస్వామ్యులైన వారినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఆచార్య వృత్తిలో ఉంటూ వైసిపి కార్యకర్తగా పని చేశారని, విశ్వవిద్యాలయాన్ని వైసిపి కార్యాలయంగా మార్చివేశారని విమర్శించారు.
అంతే కాదు రూ.100 కోట్ల రుసా నిధులను దుర్వినియోగం చేశారని, అర్హత లేకపోయినా నచ్చిన వారికి వందల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చి పునరావాస కేంద్రంగా మార్చారని ఆరోపించారు. సిఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో ఏయూకి మళ్ళీ గత వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యేలు ఎంపీ చెప్పారు. మరో వైపు చూస్తే ఏయూలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ రచ్చ గత కొంతకాలంగా సాగుతూ వచ్చింది. ఏయూ వీసీ వర్సెస్ ఆనాటి విపక్షాలు అన్న స్థాయిలో ఉద్యమాలు సాగాయి.
ఏయూ మీద ఎన్నో విమర్శలు వచ్చినా ఆనాటి వైసీపీ ప్రభుత్వం కిమ్మనక పోవడంతో మరింత ఆగ్రహ జ్వాలలు విద్యార్ధులు యువత నుంచి పెల్లుబికాయి. మరో వైపు చూస్తే ఏయూకి ఒకటి రెండు సందర్భాలలో వచ్చిన నాటి సీఎం జగన్ ఏయూ మీద వచ్చిన ఆరోపణల మీద స్పందించలేదని అంటున్నారు.
వీసీగా ఆయన్ను రెండు సార్లు నియమిస్తూ పదవీ కాలాన్ని రెన్యూవల్ చేస్తూ పోయారు తప్ప ఏయూకి ఒరగబెట్టింది ఏదీ లేదని విద్యార్ధులు అంటున్నారు. ఏయూలో అవకతవకలు పెద్ద ఎత్తున సాగాయన్న దాని మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫోకస్ పెట్టారని అంటున్నారు మరో ఏడాదితో ఏయూ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ ఏయూ అప్రతిష్టపాలు కావడం మంచిది కాదని మేధావులు అంటున్నారు. ఏయూను సమూలంగా ప్రక్షాళన చేసి సమర్ధుడైన వీసీని నియమించాలని కోరుతున్నారు.