ఆ కేసులో ఎమ్మెల్యే కొడుకు.. కోడలు పరార్
ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే.. పని మనిషికి తమ తీరుతో ఎమ్మెల్యే కొడుకు.. కోడలు చిత్రహింసలు పెట్టినట్లుగా చెప్పాలి
By: Tupaki Desk | 24 Jan 2024 9:30 AM GMTచూసినంతనే యూత్ ఫుల్ హీరో హీరోయిన్ల మాదిరిగా ఉండే రాజకీయ కుటుంబానికి చెందిన జంట మీద నమోదైన కేసు తమిళనాడులో సంచలనంగా మారింది. అధికార పార్టీ డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే కరుణానిధి (పల్లవరం నియోజకవర్గం) కుమారుడు ఆండ్రో మదివాణన్.. కోడలు మెర్లినా మీద కేసులు నమోదయ్యాయి. ఇంటి పని చేసేందుకు నియమించుకున్న యువతిని చిత్రహింసలు పెట్టినట్లుగా వారిపై కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొడుకు.. కోడలు ఇద్దరు పరారీ అయ్యారు. దీంతో వారిని అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక పోలీసుల టీంలను ఏర్పాటు చేవారు. అయితే.. కేసు నమోదు చేసి ఆరు రోజులైనా.. వారి ఆచూకీ లభించటం లేదు. మరోవైపు.. ఈ జంట పోలీసుల కళ్లు కప్పి.. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. పనికి కుదుర్చుకున్న యువతిని వేధింపులకు గురి చేసినట్లుగా నీలాంగరై ఆల్ ఉమెన్ పోలీసులు ఎమ్మెల్యే కొడుకు.. కోడలిపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే.. పని మనిషికి తమ తీరుతో ఎమ్మెల్యే కొడుకు.. కోడలు చిత్రహింసలు పెట్టినట్లుగా చెప్పాలి. పని సరిగా చేయలేదన్న పేరుతో వాతలు పెట్టటం.. రక్తం వచ్చేలా కొట్టటం.. మూడేళ్లు తమ ఇంట్లో పని చేయాలన్న ఒప్పందం మీద సంతకాలు పెట్టించుకోవటంతో పాటు.. బయటకు వెళ్లిపోతే పని మనిషి తల్లికి హాని కల్పిస్తామన్న బెదిరింపులకు పాల్పడినట్లుగా చెబుతున్నారు. వారి హింసలు ఎంత దారుణంగా ఉంటాయన్న దానికి నిదరశనంగా.. పచ్చి మిరపకాయల్ని తినిపించటం.. వంట సరిగా చేయలేదని దాడి చేయటం లాంటి దుర్మార్గాలకు పాల్పడేవారని చెబుతున్నారు. ఈ తీరు బయటకు రావటంతో అధికార పార్టీ ఎమ్మెల్యే పైనా ఆగ్రహం వెల్లువెత్తుతోంది.