Begin typing your search above and press return to search.

తాటికొండంత బాధ....కిందపడి వెక్కి వెక్కి వేసారి...

ఆయన ఇంటిపేరు తాటికొండ. ఆయన పేరు రాజయ్య. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఊరు స్టేషన్ ఘనాపూర్

By:  Tupaki Desk   |   23 Aug 2023 3:50 AM GMT
తాటికొండంత బాధ....కిందపడి వెక్కి వెక్కి వేసారి...
X

ఆయన ఇంటిపేరు తాటికొండ. ఆయన పేరు రాజయ్య. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఊరు స్టేషన్ ఘనాపూర్. అన్నీ బరువైనవే. ఘనమైనవే. రెండు సార్లు బీయారెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మొదటి దఫాలో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా అందుకుని ఒక లెవెల్ లో రాజ్యమేలిన తాటికొండ రాజయ్యకు బీయారెస్ అధినాయకత్వం టికెట్ లేదు అని చెప్పేసింది.

దాంతో ఆయన బాధ అంతా ఇంతా కాదు. తాటికొండంత అయింది. టికెట్ల ప్రకటన కేసీయార్ చేశాక తన నియోజకవర్గానికి వచ్చారు రాజయ్య. పార్టీలో తన అభిమానులు, అనుచరులతో ఆయన సమావేశం అయ్యారు. వాళ్లతో తన బాధను చెప్పుకుంటూ కళ్లనీళ్ళ పర్యంతం అయ్యారు. అంతే కాదు అంబేద్కర్ విగ్రహం దాకా వచ్చి అక్కడ ఆయనకు దండం పెడుతూ ఒక్కసారిగా కిందపడి వెక్కి వెక్కి ఏడ్చారు.

ఆయనకు వచ్చిన బాధను చూసి అభిమానుల గుండెలు తల్లడిల్లాయి. తమ నాయకుడికి ఇంతటి అన్యాయం చేసిన బీయారెస్ అధినాయకత్వం మీద వారు మండిపడ్డారు. అయితే ఇంత బాధలోనూ తనను తానే ఓదార్చుకున్న రాజయ్య తాను బీయారెస్ లోనే ఉంటాను అని స్పష్టం చేయడం విశేషం. తనకు ఇంతకంటే మంచి పదవి ఇచ్చి కేసీయార్ అండగా ఉంటాను అని హామీ ఇచ్చారని, అధినేత మాటను విశ్వసిస్తాను అని, పార్టీ లైన్ దాటను అని చెప్పి తన బాధకు వేదనకు ఒక ఆసక్తికరమైన ముగింపు పలికారు.

ఇదిలా ఉండగా రాజయ్యకి పోటీగా ఉంటూ వచ్చిన సీనియర్ మోస్ట్ లీడర్ కడియం శ్రీహరికి ఈ సీటుని ఇస్తూ పోటీకి కేసీయార్ అనుమతించారు. ఈ ఇద్దరు నేతల మధ్య ప్రతీ రోజూ మాటల వార్ అలా సాగుతూనే ఉంటుంది. మరి రాజయ్య పార్టీకి విధేయతను ప్రకటించారు. కేసీయార్ మాట వింటాను అని అన్నారు.

అదే కనుక జరిగితే కడియం శ్రీహరికి ఆయన మద్దతు ఇవ్వాలి. ఆయన్ని గెలిపించాలి. కానీ అలా జరుగుతుందా. రాజయ్యకు సొంత పార్టీలో శత్రువుగా ఉన్న కడియం శ్రీహరికి గెలిపిస్తే నియోజకవర్గంలో పట్టు పోతుంది అన్న బాధ ఎటూ ఉంటుంది కదా. పైగా కేసీయార్ తో మంచిగా ఉన్నా శ్రీహరితో చెట్టాపట్టాల్ వేయడానికి ఆయన మనసు అంగీకరిస్తుందా. దానికి ఆయన కేడర్ ఒప్పుకుంటుందా. ఇక బీయారెస్ గెలుపులో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య ఎంతవరకూ సాయం చేస్తారు అన్నది చూడాలి.

అదే విధంగా రాజయ్య బాధను చూసిన వారు ఆయన బోరున ఏడ్చిన తీరుని గమనించిన వారు ఆయన విధేయత అంతా కేసీయార్ వరకూ మాత్రమే అని అంటున్నారు. టికెట్ తనను కాదని తనను పక్కన పెట్టి చెక్ పెట్టి మరీ తెచ్చుకున్న కడియం శ్రీహరి గెలవడం కూడా తానే చూసుకోవాల్సిందే అన్నదే రాజయ్య అంతరాత్మ చెబుతున్న మాట అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే టికెట్ దక్కనందుకు చాలా మంది బాధపడ్డారు. దేశంలో అనేక చోట్ల ఇలాగే జరిగింది. ఇంకా జరగబోతోంది. కానీ ఎక్కడా లేని విధంగా ఎన్నడూ లేని విధంగా రాజయ్య మాత్రం ఇంత సీన్ క్రియేట్ చేసి వెక్కి వెక్కి ఏడ్వడం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏమి చేసినా రాజయ్యకే చెల్లు అంటున్నారు ప్రత్యర్ధులు. అయితే తమ నేత బాధ తాటికొండంత అని అనుచరులు వాదిస్తున్నారు. ఆయన కన్నీటితో కడిగేసిన సీట్లో కడియం గెలవడం అన్నదే ఇపుడు ముందున్న సవాల్ అంటున్నారు.