ఎమ్మెల్యే గారాలపట్టికి టికెట్ డౌటే.. ఇచ్చినా.. తప్పిస్తారా..!
ఈ చిక్కుల నుంచి ఎలా బయట పడాలనే విషయంపై దృష్టి పెట్టారు.
By: Tupaki Desk | 27 Jan 2024 1:30 AM GMTగుంటూరు తూర్పు వైసీపీలో అంతర్గత సెగలు పెరుగుతున్నాయి. సాధారణంగా ప్రతిపక్షాల నుంచి లేదా ప్రత్యర్థుల నుంచి నాయకులకు సెగ ఉంటుంది. ఇది రాజకీయాల్లో సహజమే. అయితే.. దీనికి భిన్నంగా.. సొంత వర్గం నాయకులు.. ఇక్కడ కీలక అభ్యర్థికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. దీంతో సదరు అభ్యర్థి.. అంతర్మథనంలో కూరుకుపోయారు. ఈ చిక్కుల నుంచి ఎలా బయట పడాలనే విషయంపై దృష్టి పెట్టారు. అదిష్టానాన్ని ఒప్పించి.. సీటు సంపాయించుకున్నా.. సొంత వర్గంలో మాత్రం సెగలను కట్టడి చేయలేక పోతున్నారు.
విషయం ఏంటంటే.. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ నాయకుడు ముస్తఫా.. వరుస విజ యాలు దక్కించుకున్నారు. 2014, 2019లో వైసీపీ తరఫున ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. నియోజకవర్గం లో మైనారిటీ నేతలు ఎక్కువగా ఉండడంతో వారిలోనూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే 2019 లో ఆయనను మరోసారి విజయతీరాలకు చేర్చింది. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకొని తన కుమార్తెకు సీటు ఇవ్వాలన్న ఆయన అభిలాషను పార్టీ అధిష్టానం ఓకే చేసింది.
దీంతో ముస్తాఫా కుమార్తె.. నూరి ఫాతిమా రంగంలోకి దిగారు. వ్యక్తిగతంగా ఆమెను ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ, గత ఐదేళ్లలో ఎమ్మెల్యే కుటుంబం వ్యవహరించిన తీరునే మైనారిటీ నాయకులు ప్రశ్నిస్తున్నా రు. ఎమ్మెల్యే ముస్తఫాకు వ్యతిరేకంగా నిత్యం.. మీడియా ముందుకు వస్తున్నారు. ముస్తఫా కుటుంబానికి టికెట్ ఇవ్వడానికి వీల్లేదని.. మత పెద్దలు కూడా.. తాజాగా తీర్మానం చేశారు. ఆమెకు ఓటు వేయొద్దని చెప్పడానికి కూడా రెడీ అయ్యారు. ఇదే ఇప్పుడు అసలు చిక్కుగా మారింది.
పోనీ.. ఇలా వ్యతిరేకిస్తున్నవారు ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు కాకపోవడం గమనార్హం. వీరంతా వైసీపీ అభిమానులు.. వైఎస్ అభిమానులు. ఆమె తప్ప.. ఆ కుటుంబం తప్ప.. అనే వాదనను వినిపిస్తున్నారనే తప్ప.. వైసీపీపై వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. దీనికి కారణం ముస్తఫా కుటుంబంలోని పలువురిపై గంజాయి.. మద్యం, గుట్కా.. అక్రమ రవాణా, నిల్వ, తయారీ కేసులు నమోదవడమే. ఇది వాస్తవమే కూడా. అయినప్పటికీ.. ఇవి ఏం చేస్తాయిలే.. అని ముస్తాఫా భావించారు. కానీ, రాను రాను సొంత వర్గమే వ్యతిరేకిస్తుండడంతో ఆయన అంతర్మథనంలో చిక్కుకున్నారు. పార్టీ కూడా.. దీనిపై దృష్టి పెట్టింది. త్వరలోనే మార్పునకు అడుగు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.