వావ్ అనేలా గర్భణికి డెలివరీ చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే
అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లింగాల మండల కేంద్రానికి తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. స్కానింగ్ చేయగా.. గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని తేలింది.
By: Tupaki Desk | 13 Jan 2024 5:27 AM GMTవైద్యుడిగా సేవలు అందించిన గతం ఉన్నప్పటికీ.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమ ప్రొఫెషన్ కు సంబంధించిన విషయాల్లో రాణించే రాజకీయ నేతలు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. అందుకు భిన్నంగా హైరిస్క్ కేసుతో వచ్చే అపాయాన్ని పట్టించుకోకుండా.. విమర్శల గురించి ఆలోచించకుండా వైద్యుడిగా తన ధర్మాన్ని నిర్వర్తించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీక్రిష్ణ గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు. అంతేనా.. రియల్లీ గ్రేట్ అంటూ మనస్ఫూర్తిగా అనేయటం ఖాయం. ఇంతకూ ఆయన చేసిన తాజా పని తెలిస్తే.. రియల్ హీరోగా చెప్పక తప్పదు.
పేరున్న సర్జన్ గా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీక్రిష్ణకు మంచి పేరుంది. అలాంటి ఆయన తన రాజకీయ పర్యటనలో ఉన్న వేళలో.. ఒక హైరిస్కుకేసు గురించి తెలిసినంతనే.. తాను వస్తున్నానని.. సర్జరీకి ఏర్పాట్లు చేయాలని చెప్పటమే కాదు.. సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన వైనం అందరి చేత అభినందల్ని అందుకునేలా చేసిందని చెప్పాలి. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లింగాల మండల కేంద్రానికి తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్న ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. స్కానింగ్ చేయగా.. గర్భంలోని శిశువు మెడకు పేగు చుట్టుకుందని తేలింది.
ఆసుపత్రిలో గైనకాలజిస్టు ఉన్నప్పటికీ హైరిస్కు కేసు కోవటంతో ఆమెను జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆర్థిక స్తోమత లేకపోవటంతో పాటు.. గర్భిణిని తరలించే వేళలో అనుకోనిది ఏదైనా జరిగితే ఎలా? అన్న సందేహాల నడుమ భయాందోళనలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీ క్రిష్ణను ఫోన్ చేసి తమ పరిస్థితిని చెప్పుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన.. తాను వస్తున్నానని.. సర్జరీకి ఏర్పాట్లు చేయాల్సిందిగా వైద్యులకు సూచనలు చేవారు.
అన్నంతనే ఉప్పునుంతల పర్యట నుంచి నేరుగా ఆసుపత్రికి వచ్చిన ఆయన.. డాక్టర్ ప్రభు.. గైనకాలజిస్టు డాక్టర్ స్రవంతితో కలిసి గర్భిణికి సిజేరియన్ చేశారు. శుక్రవారం అమ్మాయి పుట్టిందన్న ఆనందకర మాటలతో అందరు ఆనందానికి గురయ్యారు. తల్లీబిడ్డల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కష్టంలో ఉన్న మహిళకు సాయంగా నిలిచేందుకు.. సర్జరీ చేసేందుకు డాక్టర్ అయిన ఎమ్మెల్యే స్వయంగా ఆసుపత్రికి వచ్చి సర్జరీ నిర్వహించిన వైనంతో ఆయనిప్పుడు రియల్ హీరోగా మారారు. ఈ ఉదంతం గురించి తెలిసిన వారు సైతం ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.