Begin typing your search above and press return to search.

ఇప్పుడిదే చర్చ: పట్టభధ్రుల ఉప ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏమవుతుంది?

అధికార కాంగ్రెస్.. విపక్ష బీఆర్ఎస్.. బీజేపీలు ఈ సీటును సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   27 May 2024 4:12 AM GMT
ఇప్పుడిదే చర్చ: పట్టభధ్రుల ఉప ఎన్నికల్లో  ఎవరు గెలిస్తే ఏమవుతుంది?
X

వరంగల్.. ఖమ్మం.. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కీలకమైన రోజుగా సోమవారాన్ని చెప్పాలి. ఇప్పటివరకు జరిగిన హాట్ ప్రచారానికి ముగింపు పలికి.. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. తమ ఓటుతో ఎమ్మెల్సీ సీటు ఎవరికి దక్కేలా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పోటీలో 52 మంది ఉన్నప్పటికీ.. ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల మధ్యనే నెలకొంది. అధికార కాంగ్రెస్.. విపక్ష బీఆర్ఎస్.. బీజేపీలు ఈ సీటును సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి.

పోల్ వేళ.. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సీటు ఏ పార్టీ గెలిస్తే ఏం కానుంది? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. దీనికంటే ముందు.. ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థులుగా ఉన్నారన్న విషయాన్ని చూస్తే అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి.. బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదైన సత్తా చాటే బీజేపీ ఈసారి అంతగా ప్రభావం చూపలేదంటున్నారు.

అయితే.. ఈ పార్టీకి ఉండే సంప్రదాయ ఓటు బ్యాంక్ రక్షగా చెబుతున్నారు. అయితే.. బీజేపీ ఓటర్లలో తమ ఓటును ఒక్కరిగా పరిమితం చేస్తారా? లేదంటే.. ప్రాధాన్య క్రమంలో మిగిలిన వారిని ఎంపిక చేసుకుంటారా? అన్నది ప్రశ్నగా మారింది. గెలుపు అవకాశాలు ఒక మోస్తరుగా ఉన్న బీజేపీకి ఓటు వేసే వారు.. తమ ఓటును బీజేపీకే పరిమితం చేస్తారా? ప్రాధాన్యత క్రమంలో ఇతర పార్టీలకు వేస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. దీని ఆధారంగా మిగిలిన రెండు పార్టీల్లో విజేతగా ఒకరు అవతరించే వీలుందంటున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్షన్నర ఓట్లు రావటం.. రెండో స్థానంలో నిలవటం తెలిసిందే. అయితే.. గతంతో పోలిస్తే ఆయనపై నెగిటివ్ ప్రచారం సోషల్ మీడియాలోనూ.. వాట్సప్ గ్రూపుల్లోనూ సాగింది. బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ సైతం తీన్మార్ మల్లన్నపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇదిఆయనకు నెగిటివ్ గా మారుతుందని చెబుతున్నారు. అయితే.. ఈసారి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండటం కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.

ఇక.. విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థి విషయానికి వస్తే చదువుకున్న వాడన్న ప్రచారం లాభించినా.. బరిలో ఉన్న ఇతరులపై దారుణ రీతిలో వ్యాఖ్యలు చేయటం.. బీఆర్ఎస్ మీద ఉన్న నెగిటివిటీ ఆయనకు ప్రతికూలాంశంగా చెబుతున్నారు. ఇంతకూ ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఏం కానుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్ గెలిస్తే.. తన అధికారం మూణ్ణాళ్ల ముచ్చట కాదని.. ప్రజల్లో తమ పట్ల అంతులేని విశ్వాసం ఉందన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేసినట్లు అవుతుంది.

అదే బీఆర్ఎస్ గెలిస్తే మాత్రం.. కాంగ్రెస్ చేతికి అధికారం గాలివాటున వచ్చిందే తప్పించి.. ప్రజలు ఆ పార్టీ పట్ల సానుకూలంగా లేరన్నసంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది. బీజేపీ గెలిస్తే మాత్రం.. బీఆర్ఎస్ కు తీవ్రమైన నష్టం వాటిల్లటం ఖాయం. తెలంగాణలో రెండో స్థానం కోసం సాగుతున్న పోరులో.. బీజేపీ ముందుకు రావటంతో పాటు.. బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టినట్లు అవుతుంది. ఒకవేళ.. బీజేపీ గెలిస్తే మాత్రం.. రెండు ప్రధాన పార్టీలకు షాకే. మొత్తంగా ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్.. బీఆర్ఎస్ కు అనివార్యంగా మారింది. ఈ రెండింటిలో ఎవరు గెలిచినా.. మిగిలిన వారికి ఇబ్బంది ఖాయమని చెప్పకతప్పదు. మరి.. ఇలాంటి వేళలో ఓటర్లు గ్రాడ్యుయేషన్ ఓటర్లు తమ తీర్పును ఏ రీతిలో ఇస్తారో చూడాలి.