ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. తిహాడ్ జైలు నుంచి ఎయిమ్స్ కు..
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి నాలుగు నెలలుగా తిహాడ్ జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత అస్వస్ధతకు గురయ్యారు.
By: Tupaki Desk | 22 Aug 2024 9:20 AM GMTఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి నాలుగు నెలలుగా తిహాడ్ జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత అస్వస్ధతకు గురయ్యారు. దీంతో తిహాడ్ జైలు అధికారులు ఆమెను ఎయిమ్స్ కు తరలించారు. కవిత విష జ్వరం (వైరల్ ఫీవర్), గైనిక్ సమస్యలతో బాధ పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, గతంలోనూ పలుసార్లు కవిత జైల్లో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మంగళవారం కవిత బెయిల్ పిటిషన్ విచారణ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. వారం రోజుల తర్వాత అంటే.. ఈ నెల 27న విచారణ జరుగుతుందని సుప్రీం కోర్టు ప్రకటించింది.
కాగా, గతంలోనూ కవిత జైల్లో అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు మద్యం స్కాంలో బెయిల్ కోసం కవిత తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయినా ఆమెకు నిరాశే ఎదురవుతుంది. దీంతో సుదీర్ఘ నిరీక్షణ చేయాల్సి వస్తోంది. ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలకు ఇప్పటికే బెయిల్ వచ్చింది. కేజ్రీవాల్ కు లోక్ సభ ఎన్నికల సమయంలో రెండు వారాల ఉపశమనం లభించింది. తిరిగి ఆయన తిహాడ్ జైలుకు వెళ్లారు. ఇక ఇటీవల మనీశ్ సిసోడియాకు దాదాపు 17 నెలల తర్వాత బెయిల్ లభించింది. దీంతోనే కవితకూ బెయిల్ వస్తుందని భావించారు. కానీ.. వాయిదా పడుతూ పోతోంది.
జైల్లో బరువు తగ్గిపోయి
తాను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని కవిత తన బెయిల్ పిటిషన్ లో గతంలో తెలియజేశారు. వాటిని వివరించారు కూడా. మరోవైపు కవిత జైల్లో 11 కిలోల బరువు తగ్గారని ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇక జైలుకెళ్లాక కవిత పలు పుస్తకాలను తనకోసం తెప్పించుకున్నారు. ప్రశాంతత కోసం జపమాలను కూడా కోరారు. చేతి వేళ్ల గోర్లను తొలగించారు. దాదాపు ఐదు నెలలుగా కుటుంబానికి దూరంగా జైల్లో ఉంటూన్న కవితను బీఆర్ఎస్ నేతలు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. కాగా, గత మంగళవారం కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. శుక్రవారంలోగా కవిత తరఫు న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో కేసు డెరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఆలస్యం ఎందుకని ఈడీని కూడా ప్రశ్నించింది. కాగా, కవిత తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణ పూర్తయి చార్జిషీట్ కూడా వేసినందున కవితకు బెయిల్ మంజూరు చేయాలని గత మంగళవారం వాదనలు వినిపించారు. మరి ఈ నెల 27న ఏం జరగనుందో చూడాలి.