Begin typing your search above and press return to search.

అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా మహిళా ఎమ్మెల్సీ ?

అలాగే మహిళలకు పెద్ద పేట వేసినట్లు అవుతుందని భావిస్తోంది. పార్లమెంట్ లో సైతం గట్టి వాయిస్ మహిళల నుంచి ఉంటుందని తలపోస్తోంది.

By:  Tupaki Desk   |   4 Oct 2023 3:00 AM GMT
అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా మహిళా ఎమ్మెల్సీ ?
X

వైసీపీలో విశాఖ జిల్లాలో మహిళా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి దూకుడుగా ఉంటూ వస్తున్నారు. ఆమె శైలిని మెచ్చిన అధినాయకత్వం ఏపీ మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా పదవిని ఇచ్చింది. ఇక ఆమెకు రెండేళ్ళ క్రితం ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చింది. విశాఖలో ఆమె జోరు మామూలుగా ఉండడంలేదు. విశాఖ జిల్లాకే చెందిన ఏపీ టీడీపీ మహిళా ప్రెసిడెంట్ వంగలపూడి అనితకు ధీటుగా ఆమె రాజకీయం చేస్తూ వస్తున్నారు.

ఆమె టీడీపీని చంద్రబాబుని విమర్శించడంతో మంత్రి రోజా తరువాత వరసలో ఉంటారు. ఆమె విద్యాధికురాలు, బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రత్యేకించి జగన్ ఆమె పనితీరు పట్ల పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని చెబుతారు.

దాంతో ఆమెకు అనేక అవకాశాలు పార్టీ ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో అనకాపల్లి నుంచి 2024 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వరుదు కళ్యాణిని నిలబెట్టే యోచనలో అధినాయకత్వం ఉంది అని అంటున్నారు. ఆమె బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన బీసీ నాయకురాలిగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ భీశెట్టి సత్యవతికి ఈసారి టికెట్ దక్కదని అంటున్నారు. ఆమె అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటున్నారు.

ఆమెకు అక్కడ టికెట్ ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కం మంత్రి గా ఉన్న గుడివాడ అమరనాధ్ ని యలమంచిలికి షిఫ్ట్ చేస్తారు అని అంటున్నారు. గవర సామాజిక వర్గానికి చెందిన సత్యవతికి ఎమ్మెల్యే టికెట్ దక్కితే వెలమ సామాజికవర్గానికి చెందిన వరుదు కళ్యాణికి ఎంపీ టికెట్ ఇస్తే బీసీలకే పెద్ద పీట వేసినట్లుగా ఉంటుందని సామాజిక న్యాయం పాటించినట్లు అవుతుందని వైసీపీ లెక్క కడుతోంది.

అదే సమయంలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న బలమైన సామాజిక వర్గాలు కవర్ అవుతాయని, ఫలితంగా విజయం కచ్చితంగా వైసీపీ వైపు ఉంటుందని ఆ పార్టీ అధినాయకత్వం అంచనా కడుతోంది. దీంతో వరుదు కళ్యాణి ఎంపీగా పోటీ చేస్తారు అన్న ప్రచారం అయితే ఊపందుకుంది. మంచి విషయ పరిజ్ఞానం ఉన్న వరుదు కళ్యాణి కనుక ఎన్నికల బరిలో ఎంపీగా ఉంటే ఆమెకు విజయావకాశాలు ఉంటాయని, అలాగే మహిళలకు పెద్ద పేట వేసినట్లు అవుతుందని భావిస్తోంది. పార్లమెంట్ లో సైతం గట్టి వాయిస్ మహిళల నుంచి ఉంటుందని తలపోస్తోంది.

మొత్తం మీద వైసీపీ ఎంపీ అభ్యర్ధుల ఎంపిక ఈసారి ఊహకు అందకుండా ఉంటుందని ప్రత్యర్ధుల ఎత్తులకు పై ఎత్తు వేసేలా ఉంటుందని అంటున్నారు. జగన్ డేరింగ్ గా కొత్త ముఖాలను అలాగే రాజకీయంగా యువతను బలమైన సామాజికవర్గాలను దించడం ద్వారా ఉత్తరాంధ్రాలో అయిదు ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు మాస్టర్ స్కెచ్ గీస్తున్నారు అని అంటున్నారు.