Begin typing your search above and press return to search.

జగన్ ని విమర్శించిన కీరవాణి!

కీరవాణి సంగీత దర్శకుడుగా టాలీవుడ్ ఖ్యాతిని ఆస్కార్ లెవెల్ కి పెంచారు. ఆయన ఎపుడూ వివాదాలకు దూరంగా ఉంటారు

By:  Tupaki Desk   |   28 Jun 2024 6:33 PM GMT
జగన్ ని విమర్శించిన కీరవాణి!
X

కీరవాణి సంగీత దర్శకుడుగా టాలీవుడ్ ఖ్యాతిని ఆస్కార్ లెవెల్ కి పెంచారు. ఆయన ఎపుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి ఆయన పొలిటిక్స్ విషయమే ఎపుడూ మాట్లాడరు అన్నది నిన్నటి మాట. ఆయన కూడా పొలిటికల్ పంచులు పేలుస్తారు అని మీడియా మొఘల్ దివంగత రామోజీరావు సంస్మరణ సభలో అంతా తొలిసారి చూశారు.

సంస్మరణ సభ కాబట్టి పాలిటిక్స్ కి దూరంగానే అంతా మాట్లాడుతారు అనుకున్నారు. అనేక మంది వక్తల ప్రసంగాలు అలాగే సాగాయి. కానీ కీరవాణి మాత్రం తన సహజ శైలికి భిన్నంగా గత ప్రభుత్వం తీరు మీద విమర్శలు సంధించారు. కబంధ హస్తాలలో ఏపీ అయిదేళ్ళుగా ఉండిపోయింది అని ఆయన అంటూ జగన్ ని నేరుగా టార్గెట్ చేశారు.

నిజానికి ఇదే సభలో రాజకీయ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అంత దాకా ఎందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు. వారు కేవలం రామోజీరావుని ప్రశంసించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. అలాంటిది ఎవరూ చేయని సాహసం కీరవాణి చేయడం మీద చర్చ సాగుతోంది. కీరవాణికి అసలు రాజకీయ విమర్శలు చేయడానికి ఏమి పని అని అంటున్నారు. రామోజీరావుని పొగిడితే మంచిది. అక్కడితో తన ప్రసంగం ఆపు చేసుకోవాలి కానీ ఒక రెగ్యులర్ పొలిటీషియన్ మాదిరిగా సమయం కానీ సమయంలో సందర్భం కూడా చూసుకోకుండా ఆయన విమర్శలు చేయడం ఏంటి అని అంతా చర్చిస్తున్నారు.

ఒక సినీ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి అందరివాడు గా ఉంటున్నారు. ఆయన సంగీతం అంటే అంతా ఇష్టపడతారు. అలాంటిది లేని పోని రాజకీయం రంగు అంటించు కోవాల్సిన అవసరం ఆయనకు ఉందా అని చర్చించుకుంటున్నారు. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, ఓడలు బళ్ళు అవుతాయి. వాటి జోలికి ఇతర రంగాల వారు ఎవరూ వెళ్లకపోవడానికి కారణం అదే.

అలాంటిది కీరవాణికి ఎందుకు ఈ దురద అని అంతా అంటున్న పరిస్థితి. ఇంకా గట్టిగా చెప్పాలంటే కీరవాణిని సంగీతం విషయంలో అభిమానించే వారు సైతం ఆయన తాజా వ్యాఖ్యల పట్ల నివ్వెరపోతున్నారు రామోజీరావుని అసలు రాజకీయ రొంపిలోకి తేవడమే పెద్ద తప్పు. ఆయన ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అలాంటి ఆయనకు ప్రభుత్వాల విషయంలో భేదాభిప్రాయాలు ఉంటే అది ఆయన చూసుకున్నారు.

ఇతరులకు ఏమిటి పని అని అంటున్నారు. ఆ విధంగా కీరవాణి మాట్లాడడం ద్వారా ఆయనని ఒక రాజకీయ పార్టీకి కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేసే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. రామోజీరావు మీద బురద జల్లడం అంటే సూర్యుడు మీద ఉమ్మి వేయడం లాంటిది అని కీరవాణి పోలిక తేవడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు

ఇలా అనవసరం అయిన విషయాలు కీరవాణి మాట్లాడి తన ఆస్కార్ అవార్డు విలువను తగ్గించుకున్నారు అని కూడా అంటున్నారు. రాజకీయాలు ఏమీ అంటరాని రంగం కాదు, ఎవరైనా రావచ్చు. సినీ రంగం నుంచి పవన్ కళ్యాణ్ వచ్చి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందువల్ల కీరవాణికి ఆసక్తి ఉంటే ఆ పని స్వేచ్చగా చేయవచ్చు అని సలహాలు వస్తున్నాయి.

కానీ సందర్భ శుద్ధిని మరచి వేదిక ఏది అయినా కూడా అనవసర ప్రస్తావనలు తేవడం కీరవాణి లాంటి ప్రతిభావంతులకు మంచిది కాదనే అంటున్నారు. ఏది ఏమైనా కీరవాణి తనకు ఉన్న అపారమైన అభిమాన జనం నుంచి కొంతమందిని తగ్గించుకున్నారు ఏఅ మాట ఇపుడు వినిపిస్తోంది. అయన మీద వైసీపీ నేతలు కానీ జగన్ అభిమానులు కానీ తమ అభిప్రాయాన్ని మార్చుకుని రేపటి నుంచి వేరే విధంగా చూస్తారని అంటున్నారు. మొత్తానికి కీరవాణి వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.