అవిశ్వాస తీర్మానం... ఎన్డీయేతో విభేదించిన ఎం.ఎన్.ఎఫ్!
ఇందులో భాగంగా... అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ లోక్ సభ ఎంపీ సి లాల్ సంగా ప్రకటించారు.
By: Tupaki Desk | 10 Aug 2023 11:50 AM GMTప్రస్తుతం పార్లమెంట్ లో మోడీ సర్కార్ పై విపక్షాలు ప్రవేశపెట్టిన "అవిశ్వాస తీర్మానం"పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్ లో జరిగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపైనా.. మోడీ మౌనంపైనా.. విపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నాయి! ఈ సమయంలో మోడీ సర్కార్ ని మిత్రపక్షం ఒకటి షాకిచ్చింది.
అవును... బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఎన్డీయే తో జతకట్టిన మిజోరాం ఆధారిత అధికార పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎం.ఎన్.ఎఫ్) మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా... అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ లోక్ సభ ఎంపీ సి లాల్ సంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... విపక్షాల అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మణిపూర్ లో చెలరేగిన హింసాకాండను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూటిగా స్పష్టంగా చెప్పారు.
అయితే, ఇలా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్లు కానీ, బీజేపీని వ్యతిరేకిస్తున్నట్లు కానీ భావించరాదని అన్నారు. ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడంలో పూర్తిగా విఫలమైందని.. అందుకోసమే అవిశ్వాసానికి మద్దతు ఇస్తూ తమ ఆవేదనను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఇక, ఆ రాష్ట్రంలోని ప్రజల పరిస్థితి తీవ్రంగా కలవరపరుస్తోందని చెప్పిన ఎం.ఎన్.ఎఫ్. ఎంపీ... ఈ సమస్యపై తాను తమ పార్టీ అధ్యక్షుడు, మిజోరాం ముఖ్యమంత్రి జొరాంతంగతో మాట్లాడినట్లు తెలిపారు. ఆ సమయంలో తమపార్టీ నేతలంతా అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని స్పష్టం చేశారు. దీంతో... ఎం.ఎన్.ఎఫ్. చేసిన ఈ ప్రకటనను దేశంలోని అనేక రాజకీయ పార్టీలు ప్రశంసించాయి.