గొల్లపూడిని చంపాలనుకున్న మొద్దుశీను !
అయితే కరడుగట్టిన నేరస్తుడు మొద్దు శీనులోని మరోకోణం తాజాగా బయటకు వచ్చింది.
By: Tupaki Desk | 27 May 2024 7:30 AM GMTబావ కళ్లల్లో ఆనందం కోసం అంటూ టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు నిందితుడు మొద్దుశీను ఆలియాస్ జూలకంటి శ్రీనివాస్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన మొద్దుశీను విశాఖ జైల్లో శిక్ష అనుభవిస్తూ మొద్దు శీను హత్యకు గురయ్యాడు. అయితే కరడుగట్టిన నేరస్తుడు మొద్దు శీనులోని మరోకోణం తాజాగా బయటకు వచ్చింది. ప్రముఖ ఎన్నారై కిరణ్ ప్రభ ఒక వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘‘ త్రిశూలం సినిమాలో గొల్లపూడి మారుతీరావు జయసుధ జీవితం నాశనం చేయడాన్ని చూసి గొల్లపూడి బుర్ర బద్దలు కొట్టాలనిపించి, ఆయన ఎక్కడ దొరుకుతాడా అని చాలా రోజులు ఎదురు చూశాడట’’ మొద్దు శీను. విశాఖ జైలు నుండి గొల్లపూడికి రాసిన ఒక లేఖలో మొద్దు శీను ఈ విషయం వెల్లడించడం విశేషం.
ఈ మేరకు నాలుగు పేజీలతో కూడిన లేఖలో అనేక విషయాలు మొద్దుశీను ప్రస్తావించాడు. త్రిశూలం అనేది సినిమా అని తెలిసినా కూడా గొల్లపూడి చేసిన పని తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. ‘‘ఎర్ర సీత నవల చదివానని, దాంట్లో ఎర్ర సీతను ఏడిపించిన తీరు.. సాయంకాలమైంది నవలలో హృదయాలను కరిగించిన తీరుతో తాను ముగ్ధుడైనట్లు’’ తెలిపాడు.
‘‘నక్సలైట్లు ఎందుకండీ ప్రపంచాన్ని మార్చడానికి.. గొల్లపూడి పుస్తకాలు చదివితే చాలు. ఆయన పుస్తకాలను ఉర్దూలో ట్రాన్స్‌లేట్ చేసి ఒసామా బిన్ లాడెన్‌తో చదివిస్తే ఆయన కూడా మారిపోతాడంటూ’’ మొద్దు శీను తన లేఖలో పేర్కొన్నాడు. ‘‘గొల్లపూడి కనిపిస్తే కన్నీళ్లతో తన పాదాలను కడగాలని ఉంది. మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని గురువుగా భావించుకుంటోన్న మీ శిష్యుడు మొద్దు శీను’ అంటూ ఆ లేఖలో పేర్కొనడం విశేషం. బయటి ప్రపంచానికి తెలిసిన భిన్నమైన శీను ఈ లేఖతో బయటకు వచ్చాడు.