భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.. ట్విస్టు ఏమంటే?
అప్పుడెప్పుడో వచ్చిన ఒక తెలుగు సినిమా. భార్యకు పూర్వరంగంలో ఉన్న బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి చేస్తాడు భర్త.
By: Tupaki Desk | 28 March 2025 4:57 AMఅప్పుడెప్పుడో వచ్చిన ఒక తెలుగు సినిమా. భార్యకు పూర్వరంగంలో ఉన్న బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి చేస్తాడు భర్త. అప్పట్లో ఆ మూవీ తెగ సంచలనంగా మారింది. వాణిజ్య పరంగా అంత విజయవంతంగా కానప్పటికి పెద్ద చర్చకు మాత్రం తెర తీసింది. భార్య ఇష్టాల్ని ఎంత గౌరవిస్తే మాత్రం.. ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేయటమా? అన్నదో ప్రశ్న అప్పట్లో తెర మీదకు వచ్చింది. నిజానికి అప్పట్లో ఆ కాన్సెప్టును జీర్ణించుకోవటం సాధ్యం కాలేదు.
గడిచిన రెండు దశాబ్దాల్లో వచ్చిన మార్పులతో ఇలాంటివి సినిమాల్లో మాత్రమే కాదు నిజ జీవితంలోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండే పరిస్థితి. ఈ మధ్యన ఇలాంటి విషయాల్లో జీవిత భాగస్వామి చేస్తున్న దారుణాలు ఎక్కువ అవుతున్నాయి. పెళ్లై.. పిల్లలు వచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఒకరిపై ప్రేమ కలగటం.. అతడితో జీవితాంతం కలిసి బతికేందుకు భర్తను.. పిల్లల్ని బలి పెడుతున్న మహిళలు ఎక్కువ అవుతున్నాయి.
ఈ మధ్యనే తెర మీదకు వచ్చిన ముస్కాన్ ఉదంతం గురించి తెలిసిందే. నేవీ మర్చంట్ అధికారి అయిన సౌరభ్ రాజ్ పుత్ భార్య ముస్తాన్ కు సాహిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటం.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అడ్డుగా ఉన్న సౌరభ్ ను వదిలించుకునేందుకు అతడ్ని దారుణంగా హతమార్చిన వైనం ఆలస్యంగా వెలుగురావటం.. ఈ హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఆ దారుణ క్రైంను ఇక్కడ కట్ చేసి.. మన వార్తలోకి వస్తే ఉత్తరప్రదేశ్ లోని బబ్లూ.. రాధికలకు 2017లో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి కోసం వేరే రాష్ట్రానికి వెళ్లి కూలిపనులు చేస్తుంటాడు బబ్లూ. ఇదిలా ఉంటే.. రాధికకు విశాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన బబ్లూ.. రాధికను నిలదీశాడు. ప్రియుడ్ని వదులుకోవాలని చెప్పాడు. అందుకు ఆమె నో చెప్పింది.
ఈ సమయంలోనే ముస్కాన్ ఉదంతం తెర మీదకు రావటం.. బబ్లూ సన్నిహితుల సూచన అతడి మీద పని చేసింది. దీంతో.. తన భార్యకు.. ఆమె ప్రియుడితో పెళ్లి చేయించాడు. తానే దగ్గర ఉండి ఒక ఒప్పంద పత్రాన్ని రాయించాడు. గ్రామస్థుల సమక్షంలో పెళ్లి చేశాడు. మేరఠ్ ఉదంతం గురించి విన్న తర్వాత అందరు ప్రశాంతంగా బతకాలన్న ఉద్దేశంతోనే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పాడు. ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతను బబ్లూనే తీసుకోవటం గమనార్హం. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.