మోడీ అమెరికా పర్యటన రద్దు? కేంద్రం నిశిత దృష్టి!
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 6 Feb 2025 4:55 PM GMTప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ప్రస్తుతం ఉన్న అంచనాలు.. జరుగుతున్న వివాదాలు.. పార్లమెంటులో రచ్చ వంటి పరిణామాలను పరిగణనలోకి తీసుకుని.. ప్రధాని నరేంద్ర మోడీ తన అమెరికా పర్యటనను వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నట్టు ప్రధాని కార్యాలయ వర్గాలు కూడా ఆఫ్ ది రికార్డుగా చెబుతుండడం గమనార్హం.
షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించాల్సి ఉంది. నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 10న ట్రంప్‌తో భేటీ అవుతారు. అనంతరం.. ఇండియన్ డయాస్పోరాలో భారత సంతతి పౌరులతోనూ ప్రధాని సంభాషిస్తారు. అనంతరం.. ప్రముఖ వ్యాపార వేత్తలతోనూ.. భేటీ అయి పెట్టుబడు లపై చర్చించాల్సి ఉంది.
ఇక, 13న టెస్లా దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తోనూ ప్రధాని భేటీ అయి.. పెట్టుబడులపై ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. టెస్లా ప్లాంటును భారత్‌లో ఏర్పాటు చేయాలని మస్క్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా ఇది ఖరారవుతుందని అధికారులు కూడా తెలిపారు. అయితే.. తాజాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను విడతల వారీగా ట్రంప్ పంపేస్తున్నారు. ఇలా పంపే క్రమంలో భారతీయుల చేతులకు, కాళ్లకు కూడా బేడీలు వేస్తున్నారు.
దీనిని సమర్థించుకునేందుకు మోడీ ప్రభుత్వం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నా.. విపక్షాల నుంచి తీవ్ర సెగ తగులుతోంది. గురువారం రోజు రోజంతా .. పార్లమెంటు ఉభయ సభల్లో ఇదే విషయంపై సర్కారుకు సెగ తగిలింది. విపక్షాలు తీవ్ర స్తాయిలో మోడీ పాలనపై విరుచుకుపడ్డాయి. ప్రియ మిత్రుడైన ట్రంప్‌కు ఆమాత్రం విజ్ఞప్తి చేయలేరా? అంటూ కాంగ్రెస్ సభ్యులు నిప్పులు చెరిగారు. భారతీయులను అవమానిస్తున్నా.. మౌనంగా ఉంటారా? అని ప్రశ్నించారు.
ఈ పరిణామాలకు తోడు.. అంతర్జాతీయ మీడియా సహా.. భారతీయులకు సంకెళ్లు వేసే పంపించారని నిర్ధారించింది. దీంతో ముందు కాదని చెప్పినా.. తర్వాత.. నిజాలు వెలుగులోకి రావడంతో మోడీ సర్కారు ఆత్మరక్షణలో పడింది. ఇలాంటి సమయంలో మరోనాలుగు రోజుల్లో అమెరికా పర్యటన పెట్టుకోవడం సరికాదని భావిస్తూ.. దానిని రద్దు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.