Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు.

By:  Tupaki Desk   |   8 April 2025 1:40 PM
పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ
X

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రధాని మోదీ స్వయంగా పవన్‌ కళ్యాణ్‌కు ఫోన్ చేశారు.

వివరాల్లోకి వెళితే సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు కాలిన గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ, విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌కు ధైర్యం చెప్పారు. కుమారుడి ఆరోగ్యం గురించి ఆరా తీసినందుకు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు, విశాఖపట్నం పర్యటన ముగించుకున్న పవన్ కళ్యాణ్ సింగపూర్‌కు బయలుదేరనున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా మార్క్ శంకర్‌ను చూసేందుకు సింగపూర్‌కు వెళ్తున్నారు.

కాగా మార్క్ శంకర్‌కు గాయాలైన విషయం తెలిసిన వెంటనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా తమ సందేశాలను తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

పవన్ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్‌ శంకర్‌ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు సమాచారం. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై తాజాగా సమాచారం అందించారు. 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని ఆయన తెలిపారు. అగ్నిప్రమాదంలో శంకర్ కాళ్లకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని చిరంజీవి వెల్లడించడంతో మెగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. పవన్ భార్య అనా లెజ్నోవా సింగపూర్ లోనే ఉండి కుమారుడి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను చిరంజీవి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్లు సమాచారం.