Begin typing your search above and press return to search.

మోదీ ప్రపంచానికే ప్రేమికుడు.. ఈ మాటన్నది ఎవరో తెలుసా..?

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ ను భారత ప్రధాని మోదీ అభినందించారు.

By:  Tupaki Desk   |   7 Nov 2024 7:08 AM GMT
మోదీ ప్రపంచానికే ప్రేమికుడు.. ఈ మాటన్నది ఎవరో తెలుసా..?
X

అమెరికా ఎన్నికల హడావుడి ముగిసింది.. అగ్ర రాజ్యానికి కాబోయే అధ్యక్షుడు ఎవరో తెలిసింది.. ఎందరో అంచనాలు వేసినా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత మూలాలున్న కమలా హ్యారిస్ విజయాన్ని అందుకోలేకపోయారు. తీవ్ర విమర్శలు, వివాదాలు, ఆఖరికి కోర్టు కేసులు ఎదుర్కొంటున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓటమి చవిచూశారు. ఇక కొత్త ఏడాది నుంచి అమెరికాలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ ను భారత ప్రధాని మోదీ అభినందించారు. వాస్తవానికి ఈ ఎన్నికలకు ముందు అమెరికాలో పర్యటించిన మోదీ బైడెన్, కమలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. 2020లో మాత్రం అమెరికా వెళ్లిన ఆయన ట్రంప్ తో కలిసి ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొన్నారు. తద్వారా పరోక్షంగా తన మద్దతును ప్రకటించారు. కానీ, ఆ ఎన్నికల్లో ట్రంప్ పరాజయం పాలయ్యారు.

మళ్లీ వచ్చాడు ‘మిత్రుడు’

ట్రంప్ ధోరణి ఎలా ఉన్నా.. ఆయన భారత్ కు మాత్రం మిత్రుడే అని చెప్పాలి. తాను భారత్ కు పెద్ద ఫ్యాన్ అని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. భారత సంతతి వ్యక్తులు అమెరికా డెవలప్ మెంట్ కు చేసిన సాయాన్ని కొనియాడారు. ఇక తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ కు మోదీ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత తన మిత్రుడిని ఉద్దేశిస్తూ మోదీ ఓ ట్వీట్‌ కూడా చేశారు. ప్రపంచ శాంతి కోసం ఇద్దరం కలిసి పనిచేయాలని అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, తన ట్వీట్ లో తన మిత్రుడు, ‘ప్రెసిడెంట్’ డొనాల్డ్ ట్రంప్‌ తో ఫోన్‌ లో మాట్లాడానని మోదీ పేర్కొనడం గమనార్హం. ఆయనది అద్భుత విజయంగానూ అభివర్ణించారు. టెక్నాలజీ, డిఫెన్స్, ఇంధనం, అంతరిక్షం తదితర అనేక రంగాల్లో రెండు దేశాల సంబంధాలను ఇంకా బలోపేతం చేసే దిశగా ట్రంప్‌ తో మరో విడతలో కలిసి పనిచేసేందుకు చూస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు.

మీరు ప్రపంచ ప్రేమికుడు

తాజా విజయం పట్ల ట్రంప్ నకు ప్రపంచవ్యాప్తంగా అభినందలు వెల్లువెత్తాయి. వీటిలో ప్రధాని మోదీ గ్రీటింగ్ ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ట్రంప్ నకు అతి దగ్గర వ్యక్తి మోదీనే అనుకోవాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తోనూ ట్రంప్ నకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే, మోదీతోనే మరింత దగ్గర. కాగా తనకు శుభాకాంక్షలు తెలిపిన మోదీని ఉద్దేశించి ట్రంప్ కూడా అంతే గొప్పగా స్పందించారు. ‘ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందని’ ట్రంప్‌ పేర్కొన్నారు. అంతేగాక భారత్‌ అద్భుతమైన దేశమని, మోదీ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. మోదీని, భారత దేశాన్ని నిజమైన స్నేహితులుగా భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. కాగా, ఎన్నికల్లో గెలుపు తర్వాత ట్రంప్ తొలిసారిగా మాట్లాడిన ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు కావడం విశేషం. అంతేకాదు.. ట్రంప్‌ విజయం దాదాపు ఖరారైన సందర్భంలోనూ మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు.