'హృదయపూర్వక అభినందనలు మిత్రమా'... మోడీ ఇంట్రస్టింగ్ పోస్ట్!
అత్యంత రసవత్తరంగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Nov 2024 9:51 AM GMTఅత్యంత రసవత్తరంగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే పూర్తి ఫలితాలు వెలువడక ముందే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమైంది. ఈ సందర్భంగా ఇప్పటికే తన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ యుద్ధంలో రిపబ్లికన్ లు బలంగా పోరాడారని అన్నారు. ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని.. అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుందని తెలిపారు. ఈ సమయంలో ట్రంప్ గెలుపు భారత్ తో యూఎస్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తందనే చర్చా మొదలైంది. ఈ సమయంలో మోడీ స్పందించారు.
అవును.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం కన్ ఫామ్ అయిపోయిన సంగతి తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ 270కి చేరువైన ట్రంప్ కు మరో 44 ఎలక్టోరల్ ఓట్లు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో స్పందించిన మోడీ.. ట్రంప్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా... చరిత్రాత్మక విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పిన భారత ప్రధాని నరేంద్ర మోడీ... మీ గత పదవీకాల విజయాలకు తగ్గట్టుగా.. భారత్ - అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేద్దామని అన్నారు.
ఈ సందర్భంగా ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం పాటుపడదామని ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా గతంలో పలు వేదికల్లో ట్రంప్ తో కలిసి దిగిన ఫోటోలని మోడీ పంచుకున్నారు.
ట్రంప్ కు ఇజ్రాయెల్ ప్రధాని అభినందనలు!:
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్, ఆయన సతీమణి మెలానియాకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ కు వీరి పునరాగమనం అమెరికాకు కొత్త ప్రారంభాన్ని అందిస్తుందని తెలిపారు.
ఇదే సమయంలో.. ఇజ్రాయెల్ - అమెరికా మధ్య ఈ అతిపెద్ద విజయం శక్తివంతమైన సంబంధాలకు దోహదం చేస్తుందని నెతన్యాహు పేర్కొన్నారు.