Begin typing your search above and press return to search.

హ‌రియాణా 'ఆట‌'లో మోడీ విఫ‌లం.. అనేక కార‌ణాలు!

అయితే.. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌రియాణ మార్పు దిశ‌గా అడుగులు వేసిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 1:29 PM GMT
హ‌రియాణా ఆట‌లో మోడీ విఫ‌లం.. అనేక కార‌ణాలు!
X

అది ఉత్త‌రాదికి-ప‌శ్చిమానికి మ‌ధ్యన ఉన్న కీల‌క‌మైన రాష్ట్రం. క్రీడాకారుల‌కు ముఖ్యంగా రెజ్ల‌ర్ల‌కు పుట్టినిల్లు. వ్య‌వ‌సాయ రంగంలో పంజాబ్‌తో అమీతుమీ పోటీ ప‌డుతున్న రాష్ట్రం కూడా. అదే.. హ‌రియాణా. శ్రీహ‌రి న‌డ‌యాడిన ప్రాంతంగా ప్ర‌సిద్ధి చెందిన కార‌ణంగా దీనికి `హ‌రియానం` అని పేరు. కాలక్ర‌మంలో ఈ పేరే హ‌రియాణ‌గా మారింది. ఈ గ‌డ్డ‌పై మెజారిటీ హిందువులు ఉన్నారు. అందుకే గ‌డిచిన ప‌దేళ్లుగా ఇక్క‌డ బీజేపీ విజ‌యం ద‌క్కించుకుని.. అప్ర‌తిహ‌తంగా పాల‌న సాగిస్తోంది. అయితే.. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌రియాణ మార్పు దిశ‌గా అడుగులు వేసిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రం బీజేపీకి అత్యంత కీల‌కం. వ‌రుస విజ‌యాల‌కు తోడు.. అటు దేశ‌రాజ‌ధాని ఢిల్లీకి, ఇటు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌కు కూడా స‌మీపంలో ఉన్న‌రాష్ట్రం కావ‌డంతో ఇక్క‌డ జ‌రిగే రాజ‌కీయాలు.. ఆయా రాష్ట్రాల‌పై పెను ప్ర‌భావం చూపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మూడోసారి కూడా తామే విజ‌యం ద‌క్కించుకోవాల‌ని క‌మ‌ల నాథులు శ‌త‌థా ప్ర‌య‌త్నించారు. అనేక విష‌యాలను ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌స్తావించారు. రాముడు-దేవుడితో పాటు రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని, రాజ్యాంగాన్ని కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌చారం చేశారు.

అయినా.. కూడా హ‌రియాణా ప్ర‌జ‌లు మార్పుదిశ‌గా ఓటెత్తిన‌ట్టు తాజాగా వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ స్ప‌ష్టం చేస్తున్నాయి. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్స్‌లోనూ.. బీజేపీ ఏక‌ప‌క్షంగా మూడోసారి విజ‌యం అందుకుంటుంద‌న్న భ‌రోసా ఇవ్వ‌లేక పోయాయి. దీంతో అత్యంత కీల‌క‌మైన హ‌రియాణా.. ఇప్పుడు క‌ష్ట‌కాలంలో కాంగ్రెస్‌కు అందివ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. అస‌లు బీజేపీ రేపు నిజంగానే ఓడిపోతే.. ఈ బాధ్య‌త ఎవ‌రు తీసుకోవాలి? అస‌లు ఎందుకు ఓడుతోంది? అనేవి కీల‌క ప్ర‌శ్న‌లు. సాధార‌ణంగానే ప‌దేళ్లుగా అధికారంలో ఉండ‌డంతో బీజేపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంద‌న్న‌ది అంద‌రూ చెబుతున్న మాట‌.

అయితే.. సాధార‌ణ వ్య‌తిరేక‌త‌కు ప్ర‌ధానిన‌రేంద్ర మోడీ తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు.. ఆజ్యం పోశాయి. ఫ‌లితంగానే ఇక్క‌డ మార్పు అనివార్యంగా మారుతోంది. దేశ క్రీడారంగానికి మెరిక‌ల్లాంటి యువ‌త‌ను అందిస్తున్న రాష్ట్రం హ‌రియాణ‌. ఈ క్ర‌మంలోనే రెజ్ల‌ర్లు పోరాట ప‌టిమ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఒలింపిక్స్‌లో అయినా.. ఇత‌ర అంత‌ర్జాతీయ క్రీడ‌ల్లో అయినా రాణిస్తున్నారు. అయితే.. స్వాతి మాలిక్ వ్య‌వ‌హారంలో చోటు చేసుకున్న వివాదంపై మోడీ స‌ర్కారు స్పందించిన తీరు.. పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదం అయింది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల్లో మోడీపై వ్య‌తిరేక‌త ఏడాదిన్న‌ర కింద‌టే ప్రారంభ‌మైంద‌న్న‌ది ఒక లెక్క‌.

ఇక‌, దేశానికి సైనికుల‌ను అందిస్తున్న పంజాబ్ త‌ర్వాత హ‌రియాణా రెండో స్థానంలో ఉంది. ఇక్క‌డి ప్ర‌జ‌ల్లో ఎక్కువ మంది దేశానికి సేవ చేయాల‌న్న కాంక్ష‌తోనే ఉంటారు. అయితే.. సైనిక రంగంలో మోడీ తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లు అగ్నిప‌థ్‌.. వంటివి ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఆగ్ర‌హానికి గురి చేశాయి. ఇక‌, పంట‌ల‌కు మారుపేరైన హ‌రియాణాలో రైత‌న్న‌ల ఆత్మ‌హ‌త్య‌లు కూడా పెరిగిపోయాయి. దీనికి కేంద్రం అవ‌లంబిస్తున్న విధానాల‌కు తోడు రాష్ట్రంలో బీజేపీ స‌ర్కారు అనుస‌రిస్తున్న విధానాలు తోడ‌య్యాయి. దీంతో ఈ ప‌రిణామాలన్నీ.. ఇప్పుడు ఓట్ల రూపంలో బీజేపీని అధికారంలోకి దించేయ‌నున్నాయ‌న్న‌ది జాతీయ మీడియా చేస్తున్న విశ్లేష‌ణ‌. దీనికి పూర్తి బాధ్య‌త వ్య‌క్తులుగా కంటే బీజేపీదేన‌ని చెప్పాలి.