మార్చి 1న సునీత విలియమ్స్ కు మోడీ రాసిన లేఖ ఇదే!
ఈ సమయంలో ఆమెకు ప్రధాని నరేంద్ర మోడీ రాసిన లేఖను కేంద్రమంత్రి ఎక్స్ లో పంచుకున్నారు.
By: Tupaki Desk | 19 March 2025 9:08 AM ISTఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.)లో తొమ్మిది నెలలకు పైగ చిక్కుకుపోయిన తర్వాత.. తన సహచరుడు బుచ్ విల్మోర్ తో కలిసి బుధవారం తెల్లవారుజామున భూమికి క్షేమంగా వచ్చారు భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్. ఈ సమయంలో ఆమెకు ప్రధాని నరేంద్ర మోడీ రాసిన లేఖను కేంద్రమంత్రి ఎక్స్ లో పంచుకున్నారు.
అవును... ఐ.ఎస్.ఎస్.లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ తిరిగి భూమికి చేరుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో.. మార్చి 1న భారత ప్రధాని నరేంద్ర మోడీ రాసిన లేఖను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తాజాగా ఎక్స్ లో పంచుకున్నారు. ఆమె సుమారు 17 గంటల ప్రయాణం తర్వాత ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ఈ లేఖ బహిరంగంగా విడుదలైంది.
ఈ సందర్భంగా... ఢిల్లీలో మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన సమావేశంలో ఆమె పేరు తమ సంభాషణలో ప్రస్తావనకు వచ్చిందని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. మీ పట్ల, మీ పని పట్ల తాము ఎంత గర్వపడుతున్నామో చర్చించుకున్నామని.. ఈ సంభాషణ తర్వాత తాను మీకు వ్రాయకుండా ఉండలేకపోయానని ప్రధాని మోడీ అన్నారు.
1.4 బిలియన్ల భారతీయులు మీ విజయాలను ఎల్లప్పుడూ గొప్పగా గర్విస్తున్నారని.. తాజా పరిణామాలు మీ ధైర్యం, పట్టుదలను మరోసారి ప్రదర్శించాయని.. ఇవి ఎంతో స్ఫూర్తిదాయకమైనవని ప్రధాని రాశారు. ఆమె తల్లి బోనీ పాండ్యా కూడా ఆమె తిరిగి రావడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు.
ఇదే సమయంలో.. దివంగత దీపక్ భాయ్ ఆశీస్సులు కూడా మీతో ఉంటాయని తాను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ ప్రధాని తన సొంత రాష్ట్రం గుజరాత్ నివాసి అయిన సునీత తండ్రి దీపక్ పాండ్యాను ప్రస్తావిస్తూ అన్నారు. కాగా.. సునీత తండ్రి దీపక్ పాండ్యా 2020లో మరణించారు.
ఈ సందర్భంగా... మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ మా హృదయాలకు దగ్గరగా ఉన్నారని.. భారత ప్రజలు మీ ఆరోగ్యం, మిషన్ లో విజయం కోసం ప్రార్థిస్తున్నారని.. మీరు తిరిగి వచ్చిన తర్వాత భారత్ లో మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నామని.. భారతదేశ అత్యంత ప్రసిద్ధ కుమార్తెలలో ఒకరికి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంటుందని ప్రధాని రాశారు.