మరోసారి మోడీ బాబు పవన్ గ్రూప్ ఫోటో!
ఆయన థర్డ్ టైం ఎన్డీయే సర్కార్ ఏర్పాటు చేశాక మొదటిసారి చంద్రబాబు ప్రభుత్వం ప్రమాణం చేసిన కార్యక్రమానికి వచ్చారు.
By: Tupaki Desk | 28 Aug 2024 2:39 AM GMTప్రధానిగా మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నారు. ఆయన థర్డ్ టైం ఎన్డీయే సర్కార్ ఏర్పాటు చేశాక మొదటిసారి చంద్రబాబు ప్రభుత్వం ప్రమాణం చేసిన కార్యక్రమానికి వచ్చారు. ఆ తరువాత రెండోసారి రావడానికి రంగం సిద్ధం అయింది.
ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 6న ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యటన కోసం ఏపీకి వస్తున్నారు అని అంటున్నారు. ఈ సందర్భంగా చిలుకూరు మండలం తమ్మినపట్నం కి అధికారిక పర్యటనకు వస్తున్నారు. క్రిష్ణపట్నం ఓడరేవుకు కొత్త కనెక్టివిటీగా క్రిష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఆయన శంకుస్థాపన చేస్తారు.
ఈ కృష్ణపట్నం సెజ్ సిటీ కోసం ఏకంగా 12 వేల అయిదు వందల ఎకరాల భూమిని సేకరించారు. వీటిలో ఎగుమతి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలన్నది ఉద్దేశ్యం. వీటితో పాటుగా అనేక చిన్న పరిశ్రమలు కూడా వస్తాయని దాంతో ఈ ప్రాంతం ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మారుతుందని భావిస్తున్నారు.
క్రిష్ణపట్నం పోర్టు ఉండడం వల్ల ఎగుమతులకు మంచి అవకాశాలు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. దీని వల్ల వేలాదిగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అంటున్నారు. నిజానికి ఎన్నికల కంటే ముందే అంటే వైసీపీ హయాంలోనే ప్రధాని ఈ సెజ్ సిటీకి శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ అది వాయిదా పడింది. ఇపుడు ఏపీలోనూ ఎన్డీయే ప్రభుత్వం ఉంది. దాంతో పాటుగా రెండు ప్రభుత్వాల మధ్య సహకారం మరింతగా పెరిగిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ కీలక పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఏపీకి వస్తున్న మోడీ ఈ సందర్భంగా ఏమైనా వరాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏపీలో రాజధానికి కేంద్రం ష్యూరిటీ ఉండి పదిహేను వేల కోట్ల రూపాయల రుణాన్ని ఇప్పిస్తోంది. దాంతో పాటుగా పోలవరం పూర్తి చేసే బాధ్యత మాదే అని కూడా చెబుతోంది.
ఏపీకి సంబంధించి అనేక విభజన హామీలు అయితే అలాగే ఉన్నాయి. వాటి విషయంలో మోడీ ఏమి మాట్లాడుతారు అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా మోడీ బాబు పవన్ ఎన్నికలు అయి ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత కలిసే తొలి మీటింగ్ ఇదే అని చెప్పాలి. అంతే కాదు ముగ్గురూ ఉండే గ్రూప్ ఫోటోగా కూడా ఈ సమావేశం ఉండబోతోంది అని అంటున్నారు
ఏపీ పట్ల కేంద్రం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోందని టీడీపీ కూటమి పెద్దలు చెబుతున్నారు. ఇక మోడీ అక్టోబర్ లో కూడా మరోసారి ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అపుడు మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కదలిక వస్తుందని అంటున్నారు. మొత్తానికి నెలకు ఒకసారి ఏపీకి ప్రధాని వస్తే పెండింగులో ఉన్న పనులకు అయినా చురుకుదనం వస్తుంది అని అంటున్నారు.