పార్లమెంటు సమా'వేషాలు'!
దీనికి కారణం.. అత్యున్నత విలువలకు ఆలవాలంగా పార్లమెంటు నిలుస్తుందని నాటి పెద్దలు లెక్కలు వేసుకున్నారు.
By: Tupaki Desk | 8 Dec 2024 6:31 AM GMT'భారత పార్లమెంటు.. ప్రపంచానికి కరదీపిక'- అంటూ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ.. పాత పార్లమెంటు సెంట్రల్ భవనంలో కుడి పక్క గోడకు ఇత్తడి అక్షరాలతో రాసి ఉంటాయి. ఎవరైనా గమనిస్తే.. వీటిని చదువుకోవచ్చు. అయితే.. రాజేంద్రప్రసాద్ ఉత్తినే ఈ మాట అనలేదు. చాలా దూరదృష్టి.. నిశిత అన్వేషణ తర్వాత.. మాత్రమే ఆయన చెప్పారు. దీనికి కారణం.. అత్యున్నత విలువలకు ఆలవాలంగా పార్లమెంటు నిలుస్తుందని నాటి పెద్దలు లెక్కలు వేసుకున్నారు.
కానీ, అత్యున్నత విలువల మాట దేవుడెరుగు.. సాధారణ విలువలకు కూడా వలువలు ఊడ్చేస్తున్న పరిస్థితి గత మూడుదశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఎవరికి వారే.. పార్లమెంటును భ్రష్టు పట్టించే క్రతువు లో తిలా పాపం అన్నట్టుగా తలోరకంగా వ్యవహరిస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలు.. ప్రజా సమస్యలను.. కీలక అంశాలను తోసిరాజని.. రాజకీయ అజెండాలతో ముందుకు సాగుతున్న వ్యవహారం ఎప్పటికప్పుడు పార్లమెంటుకు శీల పరీక్ష పెడుతూనే ఉంది.
తాజాగా జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో అధికార కూటమి పక్షం, ప్రతిపక్ష కూటమి పక్షం రెండుగా చీలిపోయి.. సభలను నానా రభసకు దారితీసేలా చేస్తున్నాయనడంలో సందేహంలేదు. అదానీ, మణిపూర్ అల్లర్లు, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను అస్త్రాలుగా చేసుకున్న ప్రతిపక్ష కూటమి.. ప్రధాని మోడీని ఇరుకున పెట్టే అజెండాతోనే ముందుకు సాగుతోంది. కానీ, వీటికి చోటు పెట్టుకుండా అధికార పక్షం మరింత దూకుడు ప్రదర్శిస్తోంది.
ఇక, తాజాగా.. కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింగ్ తివారీ సీటు దగ్గర 500 రూపాయల నోట్ల కట్టలు లభించాయంటూ.. నేరుగా చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చెప్పడం ద్వారా.. సభ ఉన్నతిని ఆయన ఏం చేయాలనుకున్నారన్న ప్రశ్నలు సర్వత్రా తెరమీదికి వచ్చాయి. ఏదైనా జరిగినప్పుడు.. చైర్మన్ స్తానంలో ఉన్న నాయకుడు చాలా జాగ్రత్తగా హుందాగా వ్యవహరించాలి. కానీ, అధికార పార్టీ చెప్పుచేతలు.. పై పదవులపై ఉన్న జిజ్ఞాసలు.. ఉన్నతస్థాయిలను, ఉన్నతస్థానాలను కూడా వెక్కిరిస్తున్న దుర్భర పరిస్థితి నేడు సుస్పష్టం.
దేశంలో చర్చించేందుకు సమస్యలే లేనట్టు.. కాంగ్రెస్ పార్టీ అదానీ వ్యవహారాన్ని బూతద్దంలో చూడడం.. చూపెట్టడం.. రివాజుగా మారింది. గత సమావేశాల్లోనూ పెగాసస్ స్పై వేర్, అదానీపై వచ్చిన ఆరోపణులు కీలకంగామారాయి. దీంతో ప్రజల సమస్యలు, అధిక ధరలు, రిజర్వేషన్లు, జీఎస్టీ బాదుళ్లు, నిరుద్యోగం వంటివి కేవలం ఎన్నికల ప్రచారాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఇలా ఎటు చూసినా.. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య సమావేశాల స్థానంలో వేషాలు కనిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తుండడం గమనార్హం.