Begin typing your search above and press return to search.

నేడు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు... ఏమిటీ "ఆర్కా"?

వాతావరణ మోడల్స్ ను విశ్లేషించేందూ ఇప్పుడు వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ల కెపాసిటీని భారత్ ఏకంగా మూడు రెట్లకు పెంచింది.

By:  Tupaki Desk   |   26 Sep 2024 3:40 AM GMT
నేడు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు... ఏమిటీ ఆర్కా?
X

వాతావరణ మోడల్స్ ను విశ్లేషించేందూ ఇప్పుడు వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ల కెపాసిటీని భారత్ ఏకంగా మూడు రెట్లకు పెంచింది. దీనివల్ల వాతావరణం సూచనలను మరింత కచ్చితత్వంతో జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఫలితంగా... ఎక్కడ ఎంత వాన పడుతుందో గంటల ముందే పక్కాగా వెల్లడించొచ్చు.

అవును... గతంలో టీవీలో వాతావరణ శాఖ వర్షం వస్తుంది అని చెబితే రాదని.. రాదని చెబితే వస్తుందని ఓ జోక్ ఉండేది! దానికి అప్పుడు బలమైన కారణాలే ఉండేవని చెబుతుంటారు! అయితే ఇప్పుడు లెక్క పూర్తిగా మారింది. ఇకపై మారిన వాతావరణ పరిస్థితుల గురించి ముందే పక్కాగా హెచ్చరికలు ఇవ్వడానికి వీలవుతుంది.

వాస్తవానికి.. ప్రస్తుతం పూణెలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టాపికల్ మెటీరియాలజీ (ఐఐటీఎం)లో, నొయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెధర్ ఫోర్ కాస్ట్ (ఎన్.సీ.ఎం.ఆర్.డబ్ల్యూ.ఎఫ్) లో వాతావరణ పరిశీలనకు వినియోగిస్తున్న సూపర్ కంప్యూటర్ల సామర్థ్యం 6.8 పెటాఫ్లాప్స్ గా ఉంది.

అయితే... తాజాగా రూ.850 కోట్ల వ్యయంతో ఈ ఐ.ఐ.టీ.ఎం., ఎన్.సీ.ఎం.ఆర్.డబ్ల్యూ.ఎఫ్. ల సామర్థ్యాన్ని 6.8 పెటాఫ్లాప్స్ నుంచి ఏకంగా 22 పెటాఫ్లాప్స్ కు పెంచారు. దీన్నీ నేడు ప్రధాన్నమంత్రి మోడీ పూణెలో ప్రారంభించన్నున్నారు. ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ కంప్యూటర్లు 12 కి.మీ. గ్రిడ్ పరిమాణంలో ఉపగ్రహ చిత్రాలను మాత్రమే విశ్లేషిస్తుంది.

కానీ... గ్రిడ్ సైజ్ ను 12 కి.మీ. నుంచి 6 కి.మీ. తగ్గించగలిగితే ఎక్కడ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందో కచ్చితతత్వంతో చెప్పే అవకాశం ఉంటుంది. సూపర్ కంప్యూటర్ల సామర్థ్యం 22 పెటాఫ్లాప్స్ కు పెరగడం వల్ల ఇది సాధ్యమవుతుందని అంటున్నారు.

కాగా... హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్.పీ.సీ) వ్యవస్థను ప్రారంభించిన అనంతరం రెండు నెలల్లో పూర్తిస్థాయిలోకి అందుబాటులోకి వస్తుంది. పూణెలోని సూపర్ కంప్యూటర్ (ఆర్కా) వాతావరణ మోడల్స్ నే కాదు.. అందులోని మార్పులపైనా పనిచేస్తుంది. ఫలితంగా వాతావరణ సూచనల గురించి ముందే పక్కాగా హెచ్చరికలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.